నిర్మాణ సంస్థతో కుమ్ముక్కైన అధికారులు ఒక సర్వే నంబర్లో ఉన్న చెరువును కొంతమేరకు పక్క సర్వే నంబర్‌లోకి తోసేశారు. దీనిపై రైతులు ఫిర్యాదు చేస్తే వచ్చిన హైడ్రా అధికారులు చెరువును ఇంకా నోటిఫై చేయలేదంటూ చేతులెత్తేశారు. ‘నమస్తే’లో ఈ వ్యవహారంపై వచ్చిన కథనం సంచలనం సృష్టిస్తోంది. వెంగళయ్య చెరువు దగ్గర ఆలయ్ ఇన్ఫ్రా ఆక్రమణలపై వారికి గతంలోనే అనుమతులు ఉన్నాయంటూ వారిని ఇప్పుడేమీ చేయలేమంటూ చెరువు నోటిఫై అయితే తప్ప చర్యలుండవంటున్న హైడ్రా ఒక వైపు పార్శమిది.
హైకోర్టు చెప్పినా.. పట్టించుకోవడం లేదు. చెరువును నోటిఫై చేయడంతో పాటు అసలు చెరువు విస్తీర్ణమెంత, హద్దులెక్కడున్నాయని తెలవకపోయినా ప్రైవేటు ఏజెన్సీతో కలిసి పట్టాభూములను తవ్వేస్తున్నారు. ఇదేంటని అడిగితే పోలీసులను పెట్టి కాలనీవాసులను అరెస్ట్ చేయించి మరీ వారి భూమిలో గుంతలు తవ్వుతున్నారు. సున్నంచెరువు వద్ద హైడ్రా అధికారులు చూపిస్తున్న అత్యుత్సాహం ఇది.
సిటీబ్యూరో: మహేశ్వరం మండలం మంఖాల్ గ్రామ పరిధిలోని వెంగళయ్య చెరువు సర్వే నంబర్‌ను మరో నంబర్‌లోకి తోసేసిన ఇరిగేషన్ శాఖ ఆలయ్ ఇన్ఫ్రాకు అనుకూలంగా మార్చేసింది. ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఒక సర్వే నంబర్లో ఉండాల్సిన చెరువును కొంత మేరకు మరో సర్వేనంబర్లోకి తోసేసిన అధికారుల తీరును స్థానికులు ఎండగడుతున్నారు.
చెరువులను కాపాడతామంటూ వచ్చిన హైడ్రా కూడా ఆలయ్ ఇన్ఫ్రా వారికే అనుకూలంగా మారడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువును నోటిఫై చేయకుండా ఏం చేయలేమంటున్న హైడ్రా సున్నం చెరువు వద్ద ఎందుకలా వ్యవహరిస్తున్నదంటూ హైడ్రా బాధితులు ప్రశ్నిస్తున్నారు. వెంగళయ్య చెరువు వద్ద కట్టిన నిర్మాణాల కారణంగా రైతుల భూముల్లోకి వరద రావడమే కాకుండా ఆ వరదను ఆపడానికి నిర్మాణ సంస్థ చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంపై సాక్ష్యాలతో హైడ్రాకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆరోపిస్తున్నారు.
ఆలయ్ ఇన్ఫ్రా కోసం సర్వే నంబర్‌నే జరిపిన నీటిపారుదల వ్యవహారం హైడ్రాకు కనిపించడం లేదా అని ఫిర్యాదుదారులు అడుగుతున్నారు. మహేశ్వరం మండలం మంఖాల్ రెవెన్యూ పరిధిలోని వెంగళయ్య చెరువు 618, 619, 621, 622, 623, 624 సర్వేనంబర్లలో విస్తరించి ఉంది. గ్రామ నక్షాలో సైతం ఈ ఆరు సర్వేనంబర్లలో చెరువు విస్తరించి ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మాస్టర్ ప్లాన్-2031, విలేజ్మ్యాప్ ప్రకారం చెరువు ఈ ఆరు సర్వే నంబర్ల పరిధిలోనే ఉంది.
ఇందులో ఆలయ్ ఇన్ఫ్రా విల్లాల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ మేరకు హెచ్ఎండీఏ, రెరా అనుమతులు కూడా తీసుకుంది. కానీ తనకు అనుకూలంగా చెరువు విస్తీర్ణాన్ని సర్వే నంబర్ల వారీగా మార్చడానికి నీటి పారుదల శాఖ అధికారులను ఆలయ్ ఇన్ఫ్రా మేనేజ్ చేసినట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక సర్వే నంబర్లో ఉండాల్సిన చెరువు కొంతమేరకు మరో సర్వే నంబర్‌లోకి వచ్చిందనేది వారి వాదన. దీనిపై హైడ్రాకు అన్ని డాక్యుమెంట్లను ఇచ్చినా వారు మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితిని నామమాత్రంగా పరిశీలించి ఆ తర్వాత చెరువు నోటిఫై కాలేదంటూ చేతులెత్తేయడంపై చర్చ జరుగుతోంది.
ఒక దగ్గర ఒకలా, మరో దగ్గర మరోలా అంటూ సున్నంచెరువు, వెంగళయ్య చెరువులను పోలుస్తూ మంఖాల్ స్థానికులు హైడ్రాను తప్పుబడుతున్నారు. ‘నమస్తే తెలంగాణ’ కథనం తర్వాతనైనా హైడ్రా అధికారులు వచ్చి ఆలయ్ వారి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారనుకున్నామని, అయితే ఇందులో ఏదోలోపాయికారీ ఒప్పందాలు లేక ఒత్తిళ్లు ఉండడం వల్లే హైడ్రా ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు.