సిటీబ్యూరో: ఆటో డ్రైవర్ల మధ్య సరిహద్దు పంచాయితీ ముదురుతోంది. నగరం, ఇతర జిల్లాల ఆటో డ్రైవర్లు సరిహద్దు పంచాయితీతో ఘర్షణలు పడుతున్న సంఘటనలు ఇటీవల బండ్లగూడ, మెహిదీపట్నం, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ఆర్టీఏ అధికారుల దృష్టికి సరిహద్దు పంచాయితీ ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా ఇతర జిల్లాల ఆటోలు నగరంలోనికి అనుమతి లేకపోవడంతో పొరుగు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి చుట్టుపక్క జిల్లాల డ్రైవర్లు తమ గిరాకీ నగరంలోనికే ఉంటుందని చెబుతున్నారు.
తమ ప్రాంత జిల్లా కేంద్రాలు తమకు 100 నుంచి 150 కిలో మీటర్ల దూరంలో ఉంటాయని, అక్కడికి రాకపోకలు పెద్దగా ఉండవని తెలిపారు. అందుకే చుట్టుపక్కల జనాలంతా తమ కార్యకలాపాల కోసం నగరానికి వస్తుంటారు. దీంతో ఆటోలు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే ఇతర జిల్లాల ఆటోలు నగరంలోని వస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని నగర డ్రైవర్లు అడ్డుకుంటున్నారు.కాగా, ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో గిరాకీ చాలా వరకు తగ్గింది. దీంతో ఉన్న కాస్త గిరాకీ తమకు రాకపోతే ఎలా అని నగరవాసులు చెబుతున్నారు. తమకు జీరో గిరాకీ అని, ఫైనాన్స్‌లో ఆటో కొనుగోలు చేసి నెలనెల కిస్తీ కట్టకపోతే నష్టపోతామని ఇతర జిల్లాల ఆటో డ్రైవర్లు బదులిస్తున్నారు. ఆటో ఉపాధి ప్రశ్నార్ధకంగా మారడంతోనే డ్రైవర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయని ఆటో యూనియన్ నాయకులు సత్తిరెడ్డి తెలిపారు.