‘మా కొడుకు సర్దార్‌ను కాంగ్రెస్ సర్కారే చంపేసింది. ఆ చావుకు కారణమైన ఫసియుద్దీన్‌పై చర్యలు తీసుకోకుండా.. స్వయంగా ముఖ్యమంత్రే వెంటబెట్టుకొని తిరుగుతున్నడు. ఉల్టా మాపైనే తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నది. పార్టీలో చేరాలని బెదిరించినా మేము చేరలేదని టార్గెట్ చేసి కొత్త నాటకం ఆడుతున్నరు. మాకు ప్రభుత్వం ఉద్యోగం, రూ.15లక్షలు ఇచ్చినట్టు దుష్రచారం చేస్తూ దెబ్బతీయాలని చూస్తున్నరు. ఈ మాటలేవీ జూబ్లీహిల్స్ ఓటర్లు నమ్మొద్దు. మా ఇంట్లో ఆనందం లేకుండా చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి.
– ఫాతిమా-షరీఫ్ దివంగత మైనారిటీ నేత సర్దార్ తల్లిదండ్రులు
సిటీబ్యూరో, నవంబర్ 7(నమస్తే తెలంగాణ) : తమ కొడుకును కాంగ్రెస్ సర్కారే (Congress) చంపించి కుటుంబాన్ని నాశనం చేసిందని బోరబండ డివిజన్ బీఆర్ఎస్ దివంగత మైనారిటీ నేత సర్దార్ తల్లిదండ్రులు షరీఫ్, ఫాతిమా మండిపడ్డారు. శుక్రవారం వారు ‘నమస్తే తెలంగాణ’తో తమ ఆవేదన, ఆందోళనను చెప్పుకొన్నారు. తమ కొడుకు చనిపోయి ఆరు నెలలయ్యిందని, ఈ సమయంలో ఆదుకొని వెన్నంటి ఉన్నది కేటీఆర్, బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. తమకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అండగా ఉండేవారని, ఇప్పుడు సర్దార్ చనిపోయిన తర్వాత కేటీఆర్, సునీత వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. తమను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్న తీరుతో బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నామని, అయినా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నామని ఫాతిమా చెప్పారు.
పార్టీ మారుతున్నామంటూ దుష్ప్రచారాలు చేసి మానసికంగా వేధిస్తూ బీఆర్ఎస్ను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చోటామోటా నేతలు స్థానిక మసీదుల దగ్గర, మార్కెట్ దగ్గర, కిరాణా దుకాణాల వద్ద తమపై లేని పోని ప్రచారం చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని, ఇవేవీ జూబ్లీహిల్స్ ఓటర్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మొదట్లో కాంగ్రెస్‌లో చేరాలని తమకు బెదిరింపులు వచ్చాయని ఇప్పుడు మరో కొత్త నాటకం మొదలుపెట్టారని మండిపడ్డారు. తాము పార్టీలో చేరలేదనే టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.
తమ కొడుకు చనిపోవడానికి కారణమైన ఫసియుద్దీన్‌పై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని, పైగా అతడినే వెంటబెట్టుకొని ప్రచారం చేస్తున్న సీఎం ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నారని వారు ప్రశ్నించారు. ఫసియుద్దీన్‌పై కేసులు నమోదైనా గన్‌మెన్‌ను ఇచ్చి తిప్పుతున్నారని, అందరికీ అతడితో ఇబ్బంది ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. బోరబండలో ఉన్న ప్రజలకు ఫసియుద్దీన్‌తో భయం ఉన్నదని తాము ఎన్నిసార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, ఇప్పటికైనా అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సర్దార్ చనిపోయిన తర్వాత తమ కొడుకు విషయంలో ఫహీమ్ ఖురేషి కూడా వచ్చి వెళ్లారని, ఫసియుద్దీన్‌తో పాటు కాంగ్రెస్ నేతలు గుండాగిరీ చేస్తూ తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని చెప్పారు. ఒక తల్లికి కొడుకును దూరం చేశారని, ఒక భార్యకు భర్త, చిన్నపిల్లలకు తండ్రి లేకుండా చేసింది ఫసియుద్దీన్, కాంగ్రెస్ పార్టీయేనని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడు రోజుల ముందు తనకు ప్రాణహాని ఉందని రేవంత్‌రెడ్డికి సర్దార్ ఈ-మెయిల్ చేసినా పట్టించుకోలేదన్నారు.