సిటీబ్యూరో/ఎర్రగడ: బోరబండ సీఐ వీరశంకర్ వ్యవహారశైలిపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్ అయ్యారు. సీఐ వీరశంకర్‌తో పాటు డీఐ భూపాల్ గౌడ్లపై బదిలీ వేటు వేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సీఐలను బదిలీ చేస్తూ శుక్రవారం సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ వీరశంకర్ ప్రవర్తన బాగాలేకపోవడంతో పాటు పలు ఆర్థిక అంశాలలో నేరుగా ప్రమేయం ఉండటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. ఇదే సమయంలో నమస్తే తెలంగాణ సీఐ వీరశంకర్ వ్యవహారశైలిపై కథనాలు ప్రచురించింది.
ఏసీపీ వ్యక్తిగత విచారణ చేపట్టారు. స్టేషన్లో జరిగిన వ్యవహారాలపై కానిస్టేబుళ్లను ఆరా తీయడంతో పాటు కొందరు ఫిర్యాదుదారుల స్టేట్మెంట్స్కూడా రికార్డు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సీపీ సీఐపై బదిలీ వేటు వేశారు. అలాగే ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను కూడా బదిలీ చేశారు. వీరశంకర్‌ను చార్మినార్ ట్రాఫిక్ సీఐగా, మల్కాపురం సురేందర్‌ను బోరబండ సీఐగా నియమించారు. మరోవైపు బోరబండ డీఐ భూపాల్ గౌడ్‌ను చాదర్‌ఘాట్ డీఐగా, అక్కడ పనిచేస్తున్న సైదులును బోరబండ డీఐగా నియమించారు.