Bonalu | చార్మినార్, జూన్ 29 : అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాష్ట్ర బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కమిటీ సభ్యులతో కలిసి ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం సింహావాహిని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కమిటీ సభ్యులు ఆలయం నుండి లాల్ దర్వాజా మోడ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడి నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళి రైలులో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ మాట్లాడుతూ.. ఈ నెల 30 తేదీన తెలంగాణ భవన్లో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభ కానుందని తెలిపారు. జూలై 1న ఇండియా గేట్ నుండి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటంతో భారీ ఊరేగింపు నిర్వహించనున్నామని తెలిపారు. అనంతరం ఘటాన్ని తెలంగాణ భవన్లో ప్రతిష్ఠాపన చేస్తామని తెలిపారు. 2వ తేదీన పోతరాజును స్వాగతిస్తూ అమ్మవారికి బంగారు, పట్టువస్త్రాలు సమర్పణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్ తెలిపారు. ఢిల్లీ బయలుదేరి వెళ్లిన వారిలో ఆలయ కమిటీ ప్రతినిధులు కె.విష్ణు గౌడ్, సి. వెంకటేష్, పోసాని సతీష్ ముదిరాజ్, ఎ.చంద్ర కుమార్, ఎ.వినోద్ కుమార్, ఎస్.శేషు నారాయణతో పాటు వంద మంది కమిటీ సభ్యులు ఉన్నారు.