Bonalu Festival | ఆబిడ్స్, జూలై 17: హైదరాబాద్ గోషామహల్ పరిసర ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ముగిశాయి. పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలలో మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనాలను సమర్పించడంతో పాటు ఫలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు నిర్వహించిన మరుసటి బుధవారం గోషామహల్ పరిసర ప్రాంతాలలో బోనాల ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బోనాలు, ఫలహారం బండ్ల ఊరేగింపు చేపట్టారు. పోతరాజు ఆట పాటల మధ్య యువకులు కేరింతలు కొడుతూ అమ్మవారి ఆలయాలకు చేరుకుని బోనాలను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోషామహల్, చందన్ వాడి, గౌలిగూడ, మహారాజ్ గంజ్, అశోక్ బజార్, కిషన్‌గంజ్ తదితర ప్రాంతాలలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గోషామహల్‌లోని ఐదుగుళ్ల దేవాలయం, ఏడుగుళ్ల దేవాలయం, భైరవిమాత ఆలయం, దుర్గామాత దేవాలయాలతో పాటు పరిసర ప్రాంతాలను అమ్మవారి ఆలయాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలను సమర్పించుకున్నారు.
Bonalu2
ఘనంగా ఫలహారం బండ్ల ఊరేగింపు…
బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని గోషామహల్ పరిసర ప్రాంతాలలో ఫలహారం బండ్ల ఊరేగింపును అత్యంత ఘనంగా నిర్వహించారు. రాత్రి వరకు ఫలహారం బండ్ల ఊరేగింపు కనుల పండుగగా సాగింది. భైరవి మాత దేవాలయం, గోషామహల్, చందన వాడి తదితర ప్రాంతాల నుంచి ఫలహారం బండ్ల ఊరేగింపును నిర్వహించారు. స్థానిక ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రాంతాలలో స్వాగత వేదిక లను ఏర్పాటు చేసి ఫలహారం బండ్లకు స్వాగతం పలికారు. మహిళలు సంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనాలను సమర్పించగా నిర్వాహకులు పెద్ద ఎత్తున ఫలహారం బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు చేపట్టారు.