కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 20: కూకట్పల్లి నియోజకవర్గంలో బోనాల పండుగ వేడుకలు (Bonalu Festival) అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామదేవతలకు భక్తిశ్రద్ధలతో బోనాలతో నైవేద్యాలు సమర్పించారు. తొట్టెలు, ఫలహార బండ్లు ఊరేగింపు వేడుకలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో వేడుకలు సందడిగా సాగాయి.
కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయంలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, తండ్రి కొండలరావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఆషాఢ బోనాల వేడుకలని, పండుగను ప్రజలంతా కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ చల్లగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజా దేవి, మాజీ కార్పొరేటర్ రంగారావు, సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.
కేబీహెచ్‌బీ కాలనీ 3వ పేజ్‌లోని పోచమ్మ, బంగారం మైసమ్మ, కనకదుర్గ ఆలయాలలో, 6వ ఫేజ్‌లోని శ్రీ విజయ దుర్గ ఆలయంలో జరిగిన బోనాల వేడుకలలో కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. బాలాజీ నగర్ డివిజన్లోని చిత్తారమ్మ దేవాలయంలో కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.