e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home హైదరాబాద్‌ బోనం బైలెల్లె.. తల్లికి ప్రణమిల్లె..

బోనం బైలెల్లె.. తల్లికి ప్రణమిల్లె..

  • బోనమెత్తిన భాగ్యనగరం..ఆనంద పరవశం
  • అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
  • వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
  • పులకించిన ‘లాల్‌దర్వాజ’
  • సింహవాహిని మహంకాళిని దర్శించుకున్న ప్రముఖులు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు
  • గోల్కొండ జగదాంబికకు ఏడో బోనం

భాగ్యనగరం మురిసిపోయింది.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సంబురం వెల్లివిరిసింది..అమ్మలకు బోనం సమర్పించి భక్తజనం తరించిపోయింది.. చల్లగా చూడాలని వేడుకుంది.. మహమ్మారిని తరమాలంటూ విన్నవించింది..నగర సంప్రదాయంలో మమేకమైన బోనాల ఉత్సవాలు ఆదివారం పాతనగరంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో కనులపండువగా జరిగాయి. పాతబస్తీ లాల్‌దర్వాజలో కొలువైన సింహవాహిని మహంకాళి దేవాలయంతోపాటు అక్కన్న మాదన్న, గౌలిపుర భరత్‌మాత, గౌలిగూడ, మీరాలంమండి ఆలయాలు భక్తజనసంద్రమయ్యాయి.

అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు, యువతుల కోలాటాలు ప్రత్యేకార్షణగా నిలిచాయి. ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్‌అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని పట్టువస్ర్తాలుసమర్పించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరగగా, ఆలయాల వద్ద తొక్కిసలాట జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయతోపాటు పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

సింహవాహిని.. జన ప్రవాహిని

- Advertisement -

పాతనగరంలో ప్రఖ్యాతిగాంచిన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం కిక్కిరిసిపోయింది. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన భక్తుల రాక, మధ్యాహ్నానికి ఊపందుకున్నది. బోనాల సమర్పణ, దర్శనం, ఇతర ప్రముఖులు విచ్చేసేందుకు ప్రత్యేక వరుసలు ఏర్పాటు చేశారు. తీరొక్క పూలు, విభిన్న అలంకరణ, రంగురంగుల విద్యుద్దీపాలతో అమ్మవారి ఆలయం అలరారింది. శక్తి స్వరూపిణిగా కొలిచే అమ్మవారి దర్శనం కోసంవేలాదిమంది బారులు తీరారు. సోమవారం జరిగే ఘటాల ఊరేగింపునకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఐతారం.. దేదీప్యమానంగా వెలిగిపోయింది. భాగ్యనగరం పరవశించింది. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. డప్పుల దరువులు.. భక్తిగీతాలు.. దర్వాజలకు వేప తోరణాలతో బస్తీలన్నీ కోలాహలంగా మారాయి. అమ్మవారి ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడాయి. బోనమెత్తిన ఆడపడుచులు తల్లికి మొక్కులు చెల్లించి.. మనసారా దీవించమని వేడుకున్నారు. పాతబస్తీలోని ‘లాల్‌దర్వాజ’ పరిసరాలు జాతరను తలపించాయి. భక్తులతో పాటు ప్రముఖులు సింహవాహిని మహంకాళిని దర్శించుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మహమూద్‌ అలీ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఇక గోల్కొండ ఎల్లమ్మకు భక్తులు ఏడో బోనం సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు.

పరవశించిన లాల్‌దర్వాజ

చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఆగస్టు 1: లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు తల్లి దర్శనం కోసం బారులు తీరారు. ప్రముఖులు సైతం మొక్కులు చెల్లించారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సింహవాహినితో పాటు చార్మినార్‌ భాగ్యలక్ష్మి, హరిబౌలి బంగారు మైసమ్మ, అక్కన్న మాదన్న, ఉప్పుగూడ మహంకాళి ఆలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించి పూజలు చేశారు.

అలాగే హోం మంత్రి మహమూద్‌ అలీ సైతం సింహవాహిని మహంకాళికి పట్టువస్ర్తాలు సమర్పించారు. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి మేకలబండ మహంకాళిని దర్శించుకున్నారు. అంతకు ముందు సింహవాహిని ఆలయ ప్రాంగణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఏటా బోనాల పండుగకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ప్రశాంత జీవితం గడిపేలా దీవించమని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. సీపీ అంజనీకుమార్‌, అదనపు సీసీ చౌహాన్‌, షీటీమ్స్‌ అదనపు కమిషనర్‌ షీకా గోయల్‌, దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్‌ బందోబస్తును పర్యవేక్షించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana