మెహిదీపట్నం జూన్ 29 : గోల్కొండ కోటలోని జగదాంబకు ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ ఘనంగా జరిగింది. అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి హారతి కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో పూజారి సర్వేశ్ చారి, ఈవో వసంత, సభ్యులు సంతోశ్ కుమార్, ప్రదీప్ కుమార్, అనిత,శ్రీకాంత్, యాదగిరి నిర్వహించారు.
ఇలా ఉండగా, ఆదివారం రోజు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బోనాలు, తొట్టెలను అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి దర్శనం కోసం ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో కోట కిటకిటలాడింది. ఇదిలా ఉంటే దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు సరిగా లేవంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆకతాయిల వల్ల మహిళలు ఇబ్బందులుపడ్డారు.