వీధి వీధిలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు కిక్కిరిసిన ‘సింహవాహిని’..భక్తిశ్రద్ధలతో మొక్కుల చెల్లింపు పాతబస్తీలో అమ్మవార్లకు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు..
Lal Darwaza Bonalu |చార్మినార్: యాపకొమ్మలు చేతిలో పట్టుకొని.. బోనాలను నెత్తిమీద పెట్టుకొని.. ఆడబిడ్డలు ఆలయాలకు పోటెత్తారు. ఇంటిల్లిపాది సల్లంగా చూడు తల్లి.. అంటూ.. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం భాగ్యనగరంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పుదరువులతో సిటీ బస్తీలన్నీ దద్దరిల్లాయి. ప్రతిష్టాత్మక లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయానికి భక్తులు పోటెత్తారు.
మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి..మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం, హరిబౌలి అక్కన్న మాదన్న దేవాలయం, గౌలిపుర భారతమాత అమ్మవారి ఆలయం, మీరాలం మండిలోని శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంతోపాటు ఉప్పుగూడ మహంకాళి ఆలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టువస్ర్తాలు సమర్పించారు. హరిబౌలి అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్లతో కలిసి పట్టు వస్ర్తాలను అందించారు.
మీరాలం మండి మహంకాళేశ్వర అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణారావు, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పట్టు వస్ర్తాలను సమర్పించారు. సింహవాహిని అమ్మవారికి మంత్రులు శ్రీధర్‌బాబుతోపాటు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, లాల్‌దర్వాజా, మేకలబండ ప్రాంతంలో కొలువుదీరిన నల్లపోచమ్మకు బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న తదితరులు అక్కన్న మాదన్న, సింహవాహిని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.