మారేడ్‌పల్లి, ఫిబ్రవరి 27: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా అటు ప్రయాణికులు, ఇటు స్టేషన్ ముందు వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులు, యజమానులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
గుర్తు తెలియని ఓ ఆగంతకుడి నుంచి ఫలాన హోటల్లో బాంబు పెట్టాం.. అని కంట్రోల్ రూంకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే సమాచారం అందుకున్న గోపాలపురం ఇన్స్పెక్టర్ నరేశ్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హోటల్లోని సిబ్బందిని, కస్టమర్లను బయటికి పంపించి డాగ్, బాంబ్ స్క్వాడ్లతో గంటపాటు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో హోటల్లో ఎలాంటి బాంబులేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుర్తు తెలియని ఆకతాయి చేసిన పనిగా పోలీసులు తేల్చారు. కంట్రోల్ రూంకు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.