మేడ్చల్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్యంగా పెను విషాదం మిగిల్చిన పాశమైలారం ఫార్మా కంపెనీలో కెమికల్ రియాక్టర్ పేలి కార్మికుల జీవితాలు బుగ్గిపాలైన సంఘటన మరువకముందే.. అదే తరహాలోనే మేడ్చల్ పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో మంగళవారం బాయిలర్ పేలిన సంఘటన ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఘటనలో షాపూర్‌కు చెందిన మూల శ్రీనివాస్‌రెడ్డికి త్రీవ గాయాలు అయ్యాయి. కంపెనీలో పనిచేస్తున్న సమయంలో బాయిలర్ పేలడంతో శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. పేలుడు శబ్ధం రావడంతో తోటి కార్మికులు ఘటనా స్థలంలో త్రీవగాయాలతో పడి ఉన్న శ్రీనివాస్‌రెడ్డిని దవాఖానకు తరలించారు. ప్రసుత్తం శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి విషమంగానే ఉంది. కాగా బాయిలర్ పేలిన ఘటనను అల్కలాయిడ్ ఫార్మా కంపెనీ యజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం అనేక అనుమనాలకు తావిస్తుంది. పేలుడు జరిగిన సమయంలో పరిసర ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేని కారణంగా పెను ప్రమాదం తప్పినట్లయింది.
ఫార్మా కంపెనీలో 150 మంది షిప్టుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా పేలుడు సమయంలో కంపెనీలో 70 మంది పనులు చేస్తున్నట్లు తెలిసింది. అయితే బాయిలర్ వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఒక్కడు మాత్రమే పనులు చేస్తాడని కార్మికుల ద్వారా తెలిసింది. కాగా బాయిలర్ వద్దకు అప్పుడప్పుడు ఎదైనా పని నిమిత్తం అటువైపు కార్మికులు వెళ్లే అవకాశం ఉంటుందని అయితే పేలిన సమయంలో మాత్రం అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కంపెనీలో సరైన భద్రతా చర్యలు తీసుకోవడం లేదని కార్మికుల ద్వారా తెలుస్తోంది. మందుల తయారీలో బాయిలర్ ఉపయోగం ఎంతగానో ఉంటుందని, అయితే బాయిలర్‌ను పర్యవేక్షించపోవడం పేలుడుకు కారణమని తెలుస్తుంది. అత్యధిక వేడిమి వల్లే బాయిలర్ పేలిందని కార్మికులు అనుకుంటున్నారు. కాగా బాయిలర్‌ను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించి మరమ్మతులు చేస్తే ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు.
అల్కలాయిడ్ కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనపై కంపెనీ యజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు మేడ్చల్ ఏసీసీ శంకర్‌రెడ్డి వెల్లడించారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు. గాయపడిన కార్మికుడిని స్థానికంగా ఉన్న దావాఖాకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో ఏఐజీ దవాఖాను తరలించినట్లు వివరించారు. బాయిలర్ పేలుడుపై విచారణ చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. విచారణ అనంతరం చర్యలు ఉంటాయన్నారు.