బంజారాహిల్స్, సెప్టెంబర్ 9: ఆర్ఎంపీ డాక్టర్ మరణించడంతో ఆయన స్థానంలో వైద్యుడిగా చెలామణి అవుతున్న నకిలీ డాక్టర్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకృష్ణానగర్ బీ-బ్లాక్‌లో నివాసం ఉంటున బి.మణికంఠ ( 32) అనే వ్యక్తి బీ ఫార్మసీ చదివి స్థానికంగా మెడికల్ షాపు నిర్వహించేవాడు. అదే ప్రాంతంలో శ్రీ సాయి క్లినిక్ పేరుతో క్లినిక్ నిర్వహించే రిజిస్టర్డ్ ఆర్ఎంపీ వెంకటేశ్వరరావు ఆరునెలల క్రితం మృతి చెందాడు. వెంకటేశ్వరరావు మృతి తర్వాత మణికంఠ అదే క్లినిక్‌ను తీసుకుని డాక్టర్‌గా చలామణి అవుతున్నాడు.
ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఎలాంటి అర్హత లేకుండా రోగులకు చికిత్సలు అందిస్తున్నట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడు మణికంఠపై బీఎన్ఎస్ 316, 318తో పాటు సెక్షన్ 15(2),(3) నేషనల్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.