సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163(144) సెక్షన్ను అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పరీక్షలు సజావుగా సాగేందుకు, పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని పరీక్షా కేంద్రాల చుట్టూ ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలు నిషేధమని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ఆదేశాల్లో పేర్కొన్నారు. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమ్మిగూడటం నిషేధమన్నారు. కాగా, ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు, ఫొటో స్టూడియోలు, ఇంటర్నెట్ సెంటర్లను సైతం మూసివేయాలని అధికారులు ఆదేశించారు.