వాళ్లవి మాటలు.. మావి చేతలు
పేదలకు వైద్యసాయం అందుతుంటే కండ్లుండీ చూడలేని కాంగ్రెస్
మంత్రి హరీశ్‌రావు ధ్వజం
తలసానితో కలిసి అమీర్‌పేట 50 పడకల వైద్యశాల సందర్శన
అమీర్‌పేట్, మే 26 : రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సూచిక హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఇందుకు సంబంధించి వివరాల సేకరణ జరుగుతున్నదని, త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్నట్టు చెప్పారు. గురువారం అమీర్‌పేట్‌లోని 50 పడకల ఆస్పత్రిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. ఏడేండ్ల తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, సిబ్బంది పెరగడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. గత పాలకుల 70 ఏండ్ల పాలనలో తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 17 వేలు పడకలు మాత్రమే ఉన్నాయన్నారు. స్వరాష్ట్రంలోని ఏడేండ్ల కాలంలో ఆ సంఖ్యను 27 వేలకు పెంచామని తెలిపారు. గతంలో ఐసీయూ పడకల సంఖ్య 200 ఉంటే, నేడు ఆ సంఖ్య 6 వేలకు చేరిందని, డయాలసిస్ యూనిట్లు మూడు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 60కి చేరిందని చెప్పారు.
మొన్నటి వరకు 18 ఎస్ఎన్సీయూలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 65 కు పెరిగిందని, డెడికేటెడ్ పీడియాట్రిక్ యూనిట్లు రెండు మాత్రమే ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 35కు చేరిందని వివరించారు. గతంలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య మూడు మాత్రమే ఉండగా, నేడు ఆ సంఖ్య 12కు చేరిందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 33కు చేరుతుందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్ల 700 మాత్రమే కాగా, ఈ సంఖ్యను నేడు 2840కు పెంచామని, వచ్చే రెండేండ్ల కాలంలో ఆ సంఖ్య 5,840కు చేరుతుందని వివరించారు. ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 3.62 లక్షల మంది ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్య సదుపాయాలను పొందారని వివరించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.850 కోట్లు వెచ్చించిందని తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం ఉంటే నేడు 56 శాతానికి పెరిగిందని, ఏడేండ్ల కాలంలో 15 లక్షల కాన్పులు జరిగాయని, ఇందుకు ప్రభు త్వం రూ. 1500 కోట్లు వెచ్చించింద న్నారు. గతంలో లక్ష మందిలో 96 మరణాలు ఉంటే.. నేడు ఆ సంఖ్య 56కు తగ్గిందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఈ రాజేందర్‌కుమార్, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో పేదలకు వైద్యం
కాంగ్రెస్ నాయకుల తీరును విమర్శించిన మంత్రి హరీశ్
కాంగ్రెస్ హయాంలో ప్రజలు.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అని అన్నారని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కార్‌లో నిరుపేదలు పూర్తి నమ్మకంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని తెలిపారు. నేడు నిరుపేదలకు అందుతున్న సర్కారు వైద్యసాయాన్ని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి కూడా చూడలేకపోతున్నారంటూ విమర్శించారు. ఇటీవల సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అందడం లేదంటూ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఆరోగ్యశ్రీ పథకం పడకేసిందంటూ గీతారెడ్డి చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను ఖండించారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారి వివరాలను అందిస్తానని తెలిపారు. ఇటీవలే సంగారెడ్డికి వైద్య కళాశాలను మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని గీతారెడ్డి గుర్తించాలని సూచించారు. గతంలో కనీస వసతులు లేని జహీరాబాద్ ఆస్పత్రిలో నేడు ఐసీయూ, డయాలసిస్ యూనిట్‌తో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రం వంటి సదుపాయాలు వచ్చాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఏజెన్సీ ప్రాంతాలైన ఖమ్మం, ఆదిలాబాద్‌లో వర్షాకాలం వచ్చిందంటే అంటు వ్యాధులతో ప్రజలు పిట్టల్లా రాలిపోయిన సందర్భాలను చూశామని గుర్తు చేశారు. తెలంగాణ సర్కార్ వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితులు లేవని వివరించారు. జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ నాయకులు కళ్లుండి కూడా చూడలేని వారిలా మారారని విమర్శించారు. కాంగ్రెస్ కేవలం మాటల పార్టీ అని విమర్శిస్తూ.. టీఆర్ఎస్ చేతల పార్టీ అంటూ అభివర్ణించారు.