Hyderabad | ముషీరాబాద్, మార్చి 12 : హైదరాబాద్ నగరం పరిధిలోని ముషీరాబాద్‌లో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ పేలుడు సంభవించడంతో ఓ కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. భోలక్‌పూర్ గుల్షన్ నగర్ కట్ని కాంట సమీపంలో ప్లాస్టిక్ గోదాం నిర్వహిస్తున్నారు. అందులో బీహార్‌కు చెందిన ఇసాక్ అహ్మద్(28) ప్లాస్టిక్ వస్తువులు పగులగొట్టి శుభ్రపరిచే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కెమికల్ డబ్బా పగులగొడుతుండగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో ఏం జరిగిందో అర్థం కాకపోగా అందులో పని చేస్తున్న ఇసాక్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. పేలుడు ధాటికి చేతులు, ముఖం, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.