బంజారాహిల్స్,ఏప్రిల్ 5: గ్యాస్ కొరతతో ఒకవైపు జ నం ఇబ్బందులు పడుతుంటే.. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని సరికొత్త రీతిలో బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతున్నారు మరికొందరు. పౌరసరఫరాలశాఖకు చెందిన విజిలెన్స్ అధికారులమంటూ గ్యాస్ డెలివరీ బాయ్స్ ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకుంటున్న ముఠా సభ్యులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సన్‌సిటీ, పీ అండ్ టీ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్ మంజూర్ అల్హసన్, ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ తౌఫీక్లు బీటీఎస్ రిపోర్టర్లుగా పనిచేస్తున్నారు. వారిద్దరు పద్మారావునగర్‌కు చెందిన ఆర్కే న్యూస్ రిపోర్టర్ మహ్మద్ తాజ్(29)తో కలిసి ముఠాగా ఏర్పడి నగరంలో గ్యాస్ డెలివరీ బాయ్స్‌ను గ్యాస్ ధర కంటే ఎక్కువగా వసూ లు చేస్తున్నారని, తాము పౌరసరఫరాలశా ఖ విజిలెన్స్ వి భాగం అధికారులమంటూ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్నారు.
ఈ క్రమంలో హెచ్‌పీ గ్యాస్ ఎజెన్సీకి చెందిన డెలివరీ బాయ్ శివకుమార్ రెండ్రోజుల క్రితం ఫిలింనగర్ ఎంఆర్సీ కాలనీలో ఓ ఇంట్లో సిలిండర్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడకు వచ్చిన మంజూర్ అల్హసన్, మ హ్మద్ తౌఫీక్, మహ్మద్ తాజ్‌లు తాము విజిలెన్స్ విభాగం అధికారులమంటూ బెదిరించి రూ.60వేలు ఇస్తే కేసు లేకుం డా వదిలిపెడ్తామని బేరసారాలకు దిగారు. అతడి ఫోన్ నుంచి ఫోన్‌పే ద్వారా రూ.50వే లు వేయించుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ మేరకు శివకుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫిలింనగర్ క్రైం పోలీసులు ఆదివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.