బాలానగర్, మే 21 : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్ స్క్రాప్ టెండర్ కుంబకోణం విషయంలో ప్రకంపనలు సృష్టించిన టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావుకు ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదివారం జగన్మోహన్రావు కార్యాలయానికి ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు చేరుకొని ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కొన్ని రోజులుగా తాను ఐడీపీఎల్ స్క్రాప్ విక్రయాల గోల్మాల్ను బట్టబయలు చేస్తుండడంతో బీజేపీ నాయుకులకు వెన్నులో వణుకు పుట్టి కళ్లు తెరిచారన్నారు. గత 20 సంవత్సరాలుగా ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులను ఏనాడు పట్టించుకోని కూకట్‌పల్లికి చెందిన బీజేపీ నాయకులు.. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ తో చర్చలు జరపడం ఇందుకు నిదర్శనం అన్నారు. రూ.1500 కోట్ల విలువైన ఐడీపీఎల్ స్క్రాప్‌ను తక్కువ వాల్యువేషన్ చేయించడంలో బీజేపీ నేతలు ఐడీపీఎల్ జనరల్ మేనేజర్ రామకృష్నారెడ్డి, పర్సన్ ఇన్చార్జి మేనేజర్ విజయ్‌కుమార్‌ను వాడుకున్నారని ఆరోపించారు. ఐడీపీఎల్ స్క్రాప్ విక్రయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని, ఐడీపీఎల్ ఆస్తులను తాను చేస్తున్న ప్రచారానికి విశ్రాంత ఉద్యోగులు దన్నుగా నిలిచారన్నారు.
ఐడీపీఎల్ ఆస్తులను కాపాడాల్సిన ఐడీపీఎల్ అధికారులే తక్కువ విలువ చేయించి ఎవరికి తెలియకుండా టెండర్ ప్రక్రియను పూర్తి చేయడం సరికాదన్నారు. ఐడీపీఎల్ స్క్రాప్ టెండర్ ప్రక్రియను పారదర్శంగా జరిపించాలి. కానీ, ఇక్కడి ఐడీపీఎల్ అధికారులు ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదని స్పష్టం చేశారు. ఐడీపీఎల్ స్క్రాప్ టెండర్‌ను రద్దు చేసేంత వరకు నిర్విరామంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఐడీపీఎల్ స్క్రాప్ టెండర్ అంశాన్ని అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జాతీయస్థాయిలో ఉద్యమం చేపడుతామన్నారు. స్క్రాప్ విక్రయంలో భారీ కుంబకోణం జరిగినందునే విషయాన్ని కప్పి పుచ్చు కునేందుకు ఐడీపీఎల్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. తాను చేస్తున్న పోరాట ఫలితం కారణంగానే ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగుల క్వార్టర్లను ఖాలీ చేయించే అంశాన్ని కేంద్ర మంత్రి పున: పరిశీలన చేయడం గమనార్హం అన్నారు. ఈ నేపథ్యంలోనే ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు తనకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారని ఆయన స్పష్టం చేశారు.