
చెప్పేవి నీతులు. చేసేవి బాజాప్తా వసూళ్లు. ప్రవచించేది ధర్మపు విలువలు. ఆచరించేది అరాచకపు చేష్టలు. ఇదీ నగర బీజేపీ నేతల ప్రస్తుత పరిస్థితి. బాధ్యతాయుతమైన కార్పొరేటర్ పదవిలో ఉంటూ ఆ పార్టీ నేతలు జనం మీద పడి అక్రమ వసూళ్లు ప్రారంభించారు. అవినీతి రహితం, అక్రమ రహితం, పారదర్శకమే తమ విధానమంటూ ఎన్నికల సమయంలో గొప్ప గొప్ప నినాదాలచ్చిన కమలనాథులు ఇప్పుడు సామాన్యుల నుంచి లక్షలు లక్షలు వసూలు చేస్తున్నారు. వినకపోతే నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
బడా నేతలేమో.. జన ఆశీర్వాద యాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర అంటూ మాట్లాడుతుంటే.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం దోపిడీ తతంగానికి శ్రీకారం చుట్టారు. కాషాయ పార్టీ నేతల వసూళ్లకు ఈ సారి అడిక్‌మెట్ డివిజన్ వేదికగా నిలిచింది. ఒక్కో అంతస్థు అక్రమ నిర్మాణానికి రెండు లక్షల రూపాయల చొప్పున మొత్తం 6 లక్షల రూపాయలు తెచ్చివ్వాల్సిందేనంటూ ఆ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సునీతా ప్రకాశ్‌గౌడ్ తన కుమారుడితో సొంత పార్టీ కార్యకర్తకు ఫోన్ చేయించింది.
అప్పుల్లో ఉన్నానని, ఇబ్బందుల్లో ఉన్నానని, తాను బీజేపీకి ఏండ్లుగా కార్యకర్తనని చెప్పినా.. వారు వినలేదు. డబ్బు ముట్టజెప్పాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన సంభాషణ అంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బీజేపీ కార్పొరేటర్ : హలో..అన్న నమస్తే
బీజేపీ కార్యకర్త సత్యనారాయణమూర్తి : నమస్తే వదినమ్మ నేను మూర్తిని మాట్లాడుతున్న..
కార్పొరేటర్ : చెప్పు అన్న
మూర్తి : వదినమ్మ ఏం లేదు బాబు (కార్పొరేటర్ తనయుడు) రమ్మంటే వచ్చిన. పావని మేడం నాఇంటి పని ఆపించింది. నేను పార్టీ వ్యక్తినే. బాబేమో ఫ్లోర్‌కు రూ.2 లక్షలు అడుగుతుండు. నా పరిస్థితి బాగాలేదు. మున్సిపలోళ్లు బాగా ఇబ్బంది పెడుతున్నరు.
కార్పొరేటర్ : లేదన్నా..బాబుతోనే మాట్లాడండి. నేను రావడం లేదు.
మూర్తి : నా పరిస్థితి బాగా లేదు. బాగా అప్పులై పోయినవి. నిజంగా డబ్బుల్లేవు.
కార్పొరేటర్ : సరే అన్న…చూసి మీరే మాట్లాడండి ఇదిగో బాబు మాట్లాడతారు… (ఫోన్ తనయుడికి ఇస్తూ)
కార్పొరేటర్ తనయుడు తరుణ్ : అంకుల్ ఏమీలేదు. మీరొకసారి రండి మాట్లాడుకుందాం. రాజయ్య(టౌన్‌ప్లానింగ్ మున్షీ) కూడ వచ్చిండు.
మూర్తి : నీవు చిన్నాయనవు. మమ్మీ అయితే పెద్ద మనసుతో అర్థం చేసుకుంటది.
తరుణ్ : అంకుల్ నేనేమి చిన్న పిల్లగాన్ని. ఇన్మెచ్యూరిటీతోనైతే లేను కదా.
మూర్తి : నువ్వు రూ.6 లక్షలు అడిగినవు..పెద్ద అమౌంట్ కదా
తరుణ్ : అంకుల్ మీరు వచ్చి మాట్లాడండి. ఫోన్ల ఎందుకు మాట్లాడుడు.
మూర్తి : నేనూ కూడా బీజేపీకి పనిచేసిన. చాలా కష్టపడ్డ ఓట్లు వేయించడానికి.
తరుణ్ : అంకుల్ మీరు ఇంత పెద్ద మనుషులు. నన్ను అర్థం చేసుకోండి. నేను 20 ఇయర్స్, 19 ఇయర్స్ కిడ్ కాదు. నాకు 31 ఇయర్స్.
మూర్తి : సరే నేనొచ్చి కలుస్త. ఇబ్బంది పెట్టకండి.
తరుణ్ : మీరు కూడ నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను సంతృప్తి పరచండి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ముషీరాబాద్,ఆగస్టు 27: ఇది అడిక్‌మెట్ బీజేపీ కార్పొరేటర్ సునీతా ప్రకాశ్‌గౌడ్, ఆమె కుమారుడు తరుణ్, బీజేపీ కార్యకర్త సత్యనారాయణమూర్తి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. పేరుకు నీతులు మాట్లాడుతూ చివరకు సొంత పార్టీ కార్యకర్తను కూడా వదలకుండా దోచుకతింటున్నారు. బడా నేతలేమో..జన ఆశీర్వాదయాత్ర, ప్రజా సంగ్రామ యాత్ర అంటూ మాట్లాడుతుంటే…క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు జనం మీదపడి వసూళ్ల దందాలకు పాల్పడుతున్నారు. కడుపు మండిన బీజేపీ కార్యకర్త చివరకు ఆడియో, వీడియో సంభాషణలన్నీ సామాజిక మాద్యమాల్లోకి రావడంతో వైరల్ అయ్యాయి.
అడిక్‌మెట్ బీజేపీ కార్పొరేటర్ సునీతా ప్రకాశ్‌గౌడ్ అయినప్పటికీ మొత్తం వ్యవహారాలన్నీ ఆమె కుమారుడు తరుణ్ చేస్తున్నాడని, తనను రెండునెలలుగా వేధిస్తున్నాడని సత్యనారాయణమూర్తి ‘నమస్తేతెలంగాణ’తో వాపోయారు. తననే కాకుండా డివిజన్లో వందలాదిమందిని నిత్యం వేధిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడని, దీనికి సంబంధించి వందల ఆధారాలు తనవద్ద ఉన్నాయన్నారు. కార్పొరేటర్, ఆమె తనయుడి దందాలపై శనివారం మరిన్ని వాస్తవాలు వెల్లడిస్తానని చెప్పారు.
ఇంటి నిర్మాణం కోసం రూపాయి ఇవ్వకుండా, ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం టీఎస్ బీపాస్‌ను తెచ్చింది. ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా అధికారులు సైతం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే అడిక్‌మెట్ విషయంలో కార్పొరేటర్ తనయుడే ఫిర్యాదు చేసి..తిరిగి తానే బేరసారాలకు దిగడం అనేది కొంతకాలంగా నడుస్తున్న దందాగా స్థానికులు చెబుతున్నారు. డివిజన్ పరిధిలోని పద్మానగర్‌లో సత్యనారాయణమూర్తి కేవలం రెండంతస్తులకు అనుమతి తీసుకొని, నాలుగు అంతస్తుల నిర్మాణం చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ అధికారులు రెండుసార్లు నోటీసులు జారీ చేసి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం బల్దియా అధికారులు వచ్చినపుడు పనుల్ని నిలిపివేయడం, ఆ తర్వాత పనులు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. దీనిని సాకుగా తీసుకొని కార్పొరేటర్ తనయుడు తరుణ్ కిందిస్థాయి టౌన్‌ప్లానింగ్ అధికారి రాజయ్య సహకారంతో బల్దియా ఉన్నతాధికారుల పేరు వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సత్యనారాయణమూర్తిని కూడా రెండునెలలుగా వేధిస్తున్నారు.
సొంత పార్టీ కార్యకర్తను, ఓటేసినట్లు చెప్పినా వదలలేదంటే…డివిజన్లో సామాన్యులను బీజేపీ కార్పొరేటర్ తనయుడు ఏమేరకు వేధిస్తూ డబ్బులు గుంజుతున్నాడో అర్థం చేసుకోవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంలో సత్యనారాయణమూర్తి నేరుగా కార్పొరేటర్ తనయుడు తరుణ్‌ను కలిసిన సందర్భంగా జరిగిన బేరసారాల్లో చివరకు రూ.4.50 లక్షలు ఇవ్వాలని తరుణ్ డిమాండు చేసిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇదంతా బల్దియా టౌన్‌ప్లానింగ్ అధికారి రాజయ్య సమక్షంలో జరగడం గమనార్హం.