Bjp Leader | బంజారాహిల్స్, ఏప్రిల్ 17: రెవెన్యూశాఖ నిభందనలకు విరుద్ధంగా పేదలకు కేటాయించిన స్థలాలను అక్రమంగా కొనుగోలు చేయడంతో పాటు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవనాన్ని నిర్మిస్తున్న బీజేపీ నేత హెచ్. వెంకట్‌రెడ్డి వ్యవహారాన్ని ‘నమస్తే తెలంగాణ’ గురువారం ‘అడుగడుగునా ఉల్లంఘనలే..’ పేరుతో ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. వెంటనే చర్యలు తీసుకోవాలని షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డిని ఆదేశించింది. దీంతో గురువారం రంగంలోకి దిగిన షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మిస్తున్న భవనాన్ని పాక్షికంగా కూల్చేసి..సీజ్ చేశారు.
ఇదిలా ఉండగా అక్రమంగా పట్టాలు కొనుగోలు చేయడంతో వెంకట్‌రెడ్డికి చెందిన అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వచ్చిన రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ దబాయించారు. కోర్టు ఆదేశాలను పరిశీలించగా అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలను కూల్చేందుకు జీహెచ్ఎంసీ ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్స్‌ను కొన్నాళ్లపాటు నిలిపివేయాలంటూ మాత్రమే ఉందని, ఆ ఉత్తర్వులలో రెవెన్యూశాఖకు ఎలాంటి ఆదేశాలు లేవని తేలడంతో కూల్చివేతలు పూర్తిచేశారు.