కవాడిగూడ, డిసెంబర్ 22 :రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి ఆరోపించారు. 2002లో సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను కిరాతకంగా హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం రీమిషన్ పాలసీ ద్వారా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కీస్ భాను దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేయడం అన్యాయమని ఆమె విమర్శించారు. గురువారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో బిల్కీస్ భాను రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేతను నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలో ఉంచుకొని రాక్షస పాలన సాగిస్తున్నదని విమర్శించారు.
అత్యంత పాశవికంగా, క్రూరంగా సామూహిక అత్యాచారం చేసి కుటుంబ సభ్యులను హత్య చేసిన దోషులను విడుదల చేయడానికి తప్పుబట్టారు. ఇలాంటి తీర్పుల వల్ల ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతారని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఛాయాదేవి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు పడాల నళిని, జ్యోతిశ్రీమాన్, రాధిక, అంజుమ్, రాజమౌళి, ఉజ్జిని, హైమావతి, రాజేశ్వరి, సత్యవతి, లక్ష్మి, గౌసియా, అస్మా తదితరులు పాల్గొన్నారు.