RTC Bus | సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ ) : ఆర్టీసీ బస్సులో ప్రసవించిన ఆడబిడ్డకు జనన ధ్రువీకరణపత్రాన్ని తల్లికి స్వయంగా అందజేశారు బల్దియా అధికారులు. ఈ నెల 5న హైదరాబాద్‌కు చెందిన శ్వేతారత్నం ఆరాంఘర్ 1జెడ్ బస్సు ఎక్కారు. బస్సు బహదూర్‌పురాకు చేరుకోగానే గర్భవతికి నొప్పులు అధికమవడంతో డ్రైవర్ ఎంఎం అలీ బస్సును పక్కన నిలిపి ప్రయాణికులను కిందికి దించాడు. ఈ క్రమంలో కండక్టర్ సరోజ తోటి మహిళా ప్రయాణికుల సాయంతో గర్భిణికి ప్రసవం చేయగా, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం తిరిగి అదే బస్సులో పురానాపూల్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో తల్లీబిడ్డలను అడ్మిట్ చేయించారు.
అయితే ఆ ఆడబిడ్డ పుట్టిన స్థలం జీహెచ్ఎంసీ మూడు సర్కిళ్ల పరిధిలోకి వస్తుండటంతో జనన ధ్రువీకరణ పత్రం ఎక్కడ తీసుకోవాలో అవగాహన లేక భవిష్యత్‌లో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండటంతో అధికారులు స్పందించారు. రిజిస్ట్రార్ ద్వారా శ్వేతారత్నంకు ఆమె బిడ్డకు సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. చట్టం 1969 ప్రకారం ఏ స్థలంలో అయితే పుడతారో ఆ స్థలానికి సంబంధించిన సర్కిల్ రిజిస్ట్రార్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.