సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి ఇకపై కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయానికి చెందిన సీఆర్ఎస్ ( సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం) పోర్టల్‌ను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆధార్ తరహాలో 16 అంకెల యూనిక్ నంబర్‌తో సర్టిఫికెట్లు జారీ చేయడం ద్వారా అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ..ఇందుకు ప్రస్తుతం ఉన్న ఫార్మెట్, సాఫ్ట్‌వేర్‌ను మార్చడంతో పాటు పాత డేటాను మ్యాపింగ్ చేయాలని జీహెచ్ఎంసీకి కేంద్రం పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిదిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల జనన, మరణ సమాచారాన్ని అధ్యయనం చేసి గత డేటాను సీఆర్ఎస్లోకి మ్యాప్ చేయనున్నారు.
ఈ మ్యాపింగ్ ప్రక్రియలో రిజిస్ట్రార్లను సమన్వయం చేస్తున్నారు. పాత డేటాను సీఆర్ఎస్లోకి బదిలీ చేయడం ద్వారా భవిష్యత్‌లో ఎక్కడి నుంచైనా యూనిక్ నంబర్‌తో జనన, మరణ సర్టిఫికెట్లను సులభంగా పొందే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సీఆర్ఎస్ విధానం అమలైతే జీహెచ్ఎంసీ పరిధిలో జనన, మరణ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ పారదర్శకంగా, అక్రమాలకు అస్కారం లేకుండా సాగుతుందంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ అధికారుల బృందం సమన్వయంతో త్వరలో ఈ సాఫ్ట్వేర్ అమలు చేయనున్నారు.