కీసర, మార్చి 15: జనన,మరణ ధ్రువపత్రాల కోసం ఇక నుంచి మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. రోజుల పాటు నిరీక్షణ అవసరం లేదు. నిన్నమొన్నటి వరకు మాన్యువల్ జారీ అయిన ధ్రువపత్రాలు ఇకపై పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకంతో జారీ అవుతాయి. ఆయా సర్టిఫికెట్ల కోసం ఆన్లైన్లలో దరఖాస్తు చేసుకొన్న కొద్దిరోజుల్లోనే పత్రాలు చేతిలో పడతాయి. స్థానికంగా ఉన్న ప్రజలు జనన, మరణ ధ్రువపత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత దరఖాస్తుదారుడి మొబైల్‌కు ఐప్లె చేసిన వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ధ్రువపత్రం జారీ అయిందని మెసేజ్ వచ్చినప్పుడు దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రానికి వెళ్లి పత్రాలు తీసుకోవాలి.
కార్యదర్శులకు డిజిటల్ ’కీ’..
పంచాయతీ కార్యదర్శులకు ఇక నుంచి పంచాయతీ కార్యాలయాల ద్వారా జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. అందుకు వారికి మండల పరిషత్ నుంచి డిజిటల్ ’కీ’ ఇస్తుంది. సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మండల స్థాయిలో ఎంపీడీవోల నేతృత్వంలో మండల పంచాయతీ అధికారులు సూపర్వైజ్ చేస్తారు.
పౌర సేవల్లో పారదర్శకత
పౌరసేవల్లో పారదర్శకత తీసుకొచ్చి ఫోర్జరీ, నకిలీ సర్టిఫికెట్ల బెడద నివారించేందుకు పంచాయతీరాజ్ శాఖ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులువైన పద్ధ్దతిలో జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేస్తున్నది. పంచాయతీ కార్యదర్శులు దరఖాస్తుదారుల వివరాలు సేకరించి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
– కె.రమాదేవి,ఎంపీడీవో
మూడు రోజుల్లోనే జారీ చేస్తాం..
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక నుంచి పం చాయతీ కార్యదర్శులే జనన, మరణ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారం కేటాయించింది. డిజిటల్ ’కీ’విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొన్న మూడురోజుల్లో పత్రాలు చేతికి అందుతాయి.
–సురేశ్‌రెడ్డి కీసర,గోధుమకుంట పంచాయతీ కార్యదర్శి