సిటీ బ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలోని మున్సిపల్ డంపింగ్ యార్డుల్లో బయో మెడికల్ వ్యర్థాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. నగరం నలుమూలలా ఏ డొమెస్టిక్ డంపింగ్ యార్డులో చూసినా దవాఖానల నుంచి తీసుకువచ్చిన మెడికల్, కెమికల్ వ్యర్థాలు కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. దవాఖానల నుంచి వ్యర్థాలను సేకరించడానికి ప్రత్యేకంగా రూపొందించిన వందకు పైగా వాహనాలున్నా నిర్వాహకులు మున్సిపల్ వ్యర్థాలను తరలించే వాహనాల్లోనే వాటిని పడేస్తున్నారు.
చెత్త సేకరణ చేసేవాళ్లు వాటిని తీసుకొచ్చి గృహ వ్యర్థాలతో కలిపి డంపింగ్ యార్డుల్లో పారబోస్తున్నారు. అయితే డంపింగ్ యార్డు నిర్వాహకులు సైతం వాటిని వేరు చేయకపోవడంతో గృహ వ్యర్థాలతోనే అవి కలిసిపోతున్నాయి. నార్సింగి, మణికొండ, నానక్‌రామ్‌గూడ డంపింగ్ యార్డుల్లో బయో మెడికల్ వ్యర్థాల కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిలో సూదులు, సిరంజిలు, గాయాలకు డ్రెస్సింగ్ చేసిన దూది, స్లైన్ బాటిళ్లు, మూత్రపు పైపులు, మాస్కులు, చేతి గ్లౌజులు ఉన్నాయి. సిబ్బంది చేతులతోనే తీస్తున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ మండలి ఎలాంటి తనిఖీలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా చేపట్టాల్సి ఉంటుంది. వాటిని బహిరంగ ప్రదేశాల్లో, గృహ వ్యర్థాలతో కలిపి పారబోయడం అత్యంత ప్రమాదకరం. దవాఖానల్లో వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా బయో వ్యర్థాలు భారీగా పోగుపడుతాయి. వీటిలో సూదులు, సిరంజీలు, దూది, మాస్కులు, చేతి గ్లౌజలు, రక్త పరీక్ష పరికరాలు, స్లైన్ బాటిళ్లు, వైర్లు, పీపీఈ కిట్లు, శానిటరీ నాప్కిన్లు ఉంటాయి. వీటిని జీవ వైద్య వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016 ప్రకారం సురక్షితంగా, శాస్త్రీయంగా నిర్వహించాల్సి ఉంటుంది.
కానీ దవాఖాన యాజమాన్యాలు నిర్లక్ష్యంతో ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నాయి. ఇలా బయో మెడికల్ వ్యర్థాల్లో ఉండిపోయిన కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, రోగ కారకాలు.. వ్యర్థాలను తొలగించే సిబ్బందికి సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అలాగే వీటిని తొలగించే క్రమంలో సూదులు, ఫోర్స్లిప్లు గుచ్చుకుని పారిశుధ్య కార్మికులు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. అదేవిధంగా వాటిలోని రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్ల వల్ల గాలి, నీరు, నేల కలుషితమవుతున్నాయి. వాటిని తొలగించే క్రమంలో సిబ్బందికి హెపటైటిస్, హెచ్ఐవీ, టీబీ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదాలు కూడా ఉన్నాయి.
బయో వ్యర్థాలను దవాఖానల నుంచి సేకరించే వాహనాలు గ్రేటర్ వ్యాప్తంగా వందకు పైగా ఉన్నాయి. వీటిలో వివిధ రకాల వ్యర్థాలను స్టెరిలైజ్ చేసేందుకు ఏర్పాట్లు ఉంటాయి. ఆయా వాహనాలు జీపీఎస్ ట్రాకర్‌తో అనుసంధానమై ఉంటాయి. వీటిని నిర్వహించే ఏజెన్సీ వాళ్లు కాలుష్య నియంత్రణ మండలిలో వాహనాల రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. ఇవి నిరంతరం అన్ని దవాఖానల్లో చెత్తను సేకరిస్తుంటాయి. ఇందుకు దవాఖానలు నిర్వహణ ఖర్చు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డబ్బు ఇవ్వకుండా తప్పించుకునేందుకు దవాఖానలు బయో వ్యర్థాలను మున్సిపల్ చెత్త సేకరణ వాహనాల్లో వేస్తున్నారు.
దీంతో అవన్నీ డంపింగ్ యార్డులకు చేరి పర్యావరణంతో పాటు చెత్త సేకరణ సిబ్బందికి హాని కలిగిస్తున్నాయి. ఇలాంటి బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణపై కాలుష్య నియంత్రణ మండలి నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. దవాఖానలు, గృహ వ్యర్థాల డంపింగ్ యార్డుల్లో ర్యాండమ్ తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అలాంటి తనిఖీలు ఎంతమాత్రమూ జరగడం లేదని విమర్శలున్నాయి. దీంతో పర్యావరణ కాలుష్యంతో పాటు ఇటు పారిశుధ్య సిబ్బందికి రోగాలబారిన పడుతున్నారు. అధికారులు స్పందించి నిరంతర తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.