హైదరాబాద్ : హైదరాబాద్ నగరాన్ని బిన్లెస్ సిటీగా మారుస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. అందులో భాగంగా ఇంటింటికి చెత్త సేకరణ ప్రక్రియను ముమ్మరం చేసినట్లు మంత్రి చెప్పారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో మంత్రి కేటీఆర్ 325 స్వచ్ఛ ఆటోలను గురువారం ప్రారంభించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు స్వచ్ఛ ఆటోలను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వచ్ఛతను, పారిశుధ్యాన్ని ఒక ప్రాధాన్యంగా తీసుకొని 2015లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు 2500 స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. మరో 650 కొత్త స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఇందులో 325 ఆటోలను నగరంలో ప్రవేశపెడుతున్నట్లు కేటీఆర్ చెప్పారు.
ప్రజలు భాగస్వాములు కావాలి..
స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వం, జీహెచ్ఎంసీతోనే కాదని…ప్రజలు సైతం భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్త సేకరణ కోసం పంపిణీ చేసిన బుట్టలను వినియోగించి ఇండ్ల వద్దకు వచ్చే ఆటో డ్రైవర్లకు అందజేయాలని సూచించారు. కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ స్వచ్ఛత చాలా అవసరమని, శానిటేషన్‌పై మరింత దృష్టి సారించాలన్నారు. మరోసారి ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైతే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. నగర స్వచ్ఛతకు కృషి చేస్తున్న జీహెచ్ఎంసీ పాలకవర్గాన్ని, అధికార యంత్రాంగం, సిబ్బందిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, అదనపు కమిషనర్లు సంతోష్, ప్రావీణ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేకతలతో స్వచ్ఛ ఆటోలు
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అదనపు స్వచ్ఛ ఆటోలను జీహెచ్ఎంసీ సమకూర్చుతున్నది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో 2500 ఆటోలు ఉండగా, ప్రతి రోజూ ఒక్కో స్వచ్ఛ ఆటో 600 ఇండ్ల నుండి చెత్త సేకరిస్తున్నది. ఒక్కో స్వచ్ఛ ఆటో 3.5 క్యూబిక్ మీటర్ వైశాల్యంతో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ తరలిస్తున్నది. ఇప్పటికీ నగరంలో స్వచ్ఛ ఆటోలు కవర్ కానీ ప్రాంతాల్లో కొత్తగా వచ్చిన ఆటోలు గార్బేజ్ సేకరిస్తాయి. తడి, పొడి చెత్తకు వేర్వేరు పార్టీషన్ ఉండటంతోపాటు దుర్వాసన బయటకు రాకుండా, ముఖ్యంగా ప్రమాదకర వ్యర్థాలకు ప్రత్యేకంగా బాక్స్ ఉండటం కొత్తగా వచ్చిన ఆటోలో ప్రత్యేకత అని చెప్పవచ్చు.