సుల్తాన్‌బజార్,డిసెంబర్ 17. బైండ్ల కులాన్ని సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడిన కులంగా గుర్తించాలని హైదరాబాద్ బైండ్ల భవనీయ సంఘం జిల్లా అధ్యక్షులు ఏపూరి అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సుప్రీం కోర్టు నేపథ్యం లో ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమీషన్ బహిరంగ విచారణ హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏక సభ్య కమీషన్ ఛైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి సంఘం ప్రతినిధులతో కలిసి ఆయన వినతి పత్రం సమర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 2011లో జనాభా గణాంకాల ప్రకారం తెలంగాణలో 19వేల మంది బైండ్ల కులస్తులు మాత్రమే ఉన్నట్టుగా చూపించారని, అవి తప్పుడు లెక్కలు అని అన్నారు.ప్రస్తుతం జరుగుతున్న సర్వే ప్రకారం బైండ్ల జనాభాను పరిగణలోకి తీసుకొని సుమారు 6 లక్షల పైచిలుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బైండ్ల కులానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఏకసారూప్యత కలిగిన సమూహాలైన గ్రామ దేవతల పూజారులుగా రాణిస్తున్న బైండ్ల, పంబాల, కొలుపుల, ద్యావతి, అసాదుల, పోతరాజులను ఎస్సీ జాబితాలో చేర్చి 7 శాతం తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని కమీషన్‌కు ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సంఘం సలహాదారులు ఏపూరి యాదగిరి, ప్రతినిధులు వర్దల రాజేశ్, చిట్టం పల్లి కిరణ్‌కుమార్, ఉప్పునూతన నర్సింగ్‌రావు, లక్ష్మణ్ రావు, ప్రవీణ్ కుమార్, చక్రవర్తి, ఏపూరి శివకుమార్, నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.