బడ్జెట్ రూపకల్పనలో దోహదం
సామాజిక స్థితిగతులపై అవగాహన
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
సెస్ ప్రాంగణంలో హాస్టల్ నిర్మాణానికి భూమిపూజ
అమీర్‌పేట, ఫిబ్రవరి 18 : బడ్జెట్ రూపకల్పనలో సెస్ నివేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఏ మేరకు ఫలితాలిస్తున్నాయనే అంశంపై సెస్ అందిస్తున్న సమగ్ర నివేదికలు ఆర్థిక సామాజిక స్థితిగతులపై చక్కటి అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోసల్ స్టడీస్ (సెస్) ఆవరణలో రూ.5 కోట్లతో నిర్మించనున్న బాలికల వసతి గృహం భవన నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సెస్ తోడ్పాటుతో బడ్జెట్లో ఏయే రంగాలకు ఎంత కేటాయించాలన్న దానిపై స్పష్టత వస్తున్నదన్నారు. సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి మాట్లాడుతూ 2016 నుంచి సెస్ ఆధ్వర్యంలో పీహెచ్డీ కోర్సులు ప్రారంభమయ్యాయని..ప్రస్తుతం 46 మంది పీహెచ్డీ చేస్తుండగా, వీరిలో అత్యధికులు మహిళలే ఉన్నారని తెలిపారు. హాస్టల్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయని, ఇందులో సగం ఐసీఎస్ఎస్ఆర్, మిగిలిన సగం రాష్ట్ర ప్రణాళికా సంఘం సమకూర్చిందని వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, సెస్ వ్యవస్థాపక సభ్యుడు మహేందర్‌రెడ్డి, డాక్టర్ జీఆర్ రెడ్డి, సెస్ చైర్మన్ దిలీప సచనే, ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు.