Chardham Yatra | అమీర్పేట, ఫిబ్రవరి 22 : చార్ధామ్ యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికుల కోసం మొదటి ”భారత్ గౌరవ్ ట్రైన్” అందుబాటులోకి తీసుకొచ్చినట్లు టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేశ్ తెలిపారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ యూనిట్ గఢ్వాల్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ పీఆర్ఓ వీరేందర్ సింగ్ రాణాతో కలిసి శనివారం బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
మే 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ భారత్ గౌరవ్ రైలులో 16 రోజుల యాత్ర కొనసాగుతుందని రమేశ్ తెలిపారు. ఈ ప్రత్యేక రైలులో హరిద్వార్, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాల సందర్శన ఉంటుందని అన్నారు. భారతదేశపు అగ్రశ్రేణి పర్యాటక రైలు ఆపరేటర్ టూర్ టైమ్స్ సొంత రైలులో జరిగే ఈ యాత్ర 600 మంది ప్రయాణికులతో వెళ్తున్నదని పేర్కొన్నారు. రైలులో అందుబాటులో ఉన్న ప్యాంట్రీ, హౌస్ కీపింగ్, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సేవలు యాత్రికులకు గుర్తుండిపోతాయని రమేశ్ అయ్యంగార్ తెలిపారు.
రైలు ప్రయాణంతో పాటు ఆయా క్షేత్రాలను సందర్శిస్తున్న సమయంలో కూడా చక్కటి భోజన, వసతి సౌకర్యంతో పాటు రవాణా సదుపాయాలను కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్రికులకు అందుబాటులో ఉంచిందని అన్నారు. భారత గౌరవ్ రైలులో చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వారు మరింత సమాచారం కోసం బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలోని టూర్ టైమ్స్ కార్యాలయంలో లేదా www.tourtimes.in సంప్రదించవచ్చని సూచించారు.