హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ వియత్నాంకు రెండు లక్షల కొవాగ్జిన్ డోసులు విరాళంగా ప్రకటించింది. హైదరాబాదీ ఫార్మా సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా సద్భావన కింద రెండు లక్షల కొవాగ్జిన్ డోసులను వియత్నాంకు విరాళంగా అందజేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు వూంగ్ దిన్ హ్యూ, పలువురు అధికారుల సమక్షంలో ఢిల్లీలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే వియత్నాంలో అత్యవసర వినియోగ జాబితాలో తమ టీకా చేరిందన్నారు.
కాగా, జాతీయ టీకా కార్యక్రమాన్ని మరింతగా పెంచడానికి, కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకోవడానికి కొవాగ్జిన్ సహాయపడుతుందని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ‘వ్యాక్సిన్ ఈక్విటీ, టీకాల అందుబాటు వంటివి ఒక దేశ ప్రజారోగ్యానికి చాలా ముఖ్యమైనవి. రిపబ్లిక్ ఆఫ్ వియత్నాంలోని ప్రతి ఒక్కరూ సురక్షితమైన, సమర్థవంతమైన కొవాగ్జిన్‌ను పొందుతారని నేను ఆశిస్తున్నాను’ అని ఆయన అన్నారు.
మరోవైపు రెండు నుంచి 18 ఏండ్ల లోపు వయసు వారి కోసం కొవాగ్జిన్ 2, 3 దశల ట్రయల్స్‌ను భారత్ బయోటెక్ పూర్తి చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కి ఈ డేటాను సమర్పించి తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది. ఈ ఆమోదం లభిస్తే పిల్లలకు కూడా కొవాగ్జిన్ టీకా అందుబాటులోకి వస్తుంది.
Vietnam will receive 2,00,000 doses of Covaxin from Bharat Biotech and its Vietnamese partner Duc Minh: Bharat Biotech Joint MD Suchitra Ella pic.twitter.com/BnEDlKk4ae
— ANI (@ANI) December 16, 2021