సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కస్టమర్ కేర్ కోసం గూగుల్ సెర్చ్ చేసిన ఓ డాక్టర్‌ను సైబర్ చీటర్స్ రిమోట్ యాప్ డౌన్లోడ్ చేయించి ఖాతా ఖాళీ చేశారు. చిక్కడపల్లికి చెందిన డాక్టర్ సంగ్రామ్ తన ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాకు సంబంధించిన సమస్య వచ్చింది. గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికాడు. ఓ నంబర్‌కు ఫోన్ చేయగానే ‘మీరు ఎనీడెస్క్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలం’టూ.. సూచించడంతో బాధితుడు ఆ ప్రక్రియ పూర్తి చేశాడు. అతడి సెల్‌ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకున్న ఆగంతకులు నెట్ బ్యాంకింగ్‌ను ఆపరేట్ చేయించారు. రిమోట్ యాప్ ద్వారా కస్టమర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను తెలుసుకొని.. ఖాతాలోని రూ. 5 లక్షలు దోచేశారు. యూసుఫ్‌గూడకు చెందిన ఇర్ఫాన్ వ్యాపారి. అతడికి వచ్చిన ఓ సందేశానికి స్పందించడంతో తాము చెప్పినట్లు ఇన్వెస్ట్ చేస్తే.. భారీ లాభాలొస్తాయంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు..బాధితుడితో ఐఎఫ్ఎఫ్గోల్డ్ పేరుతో ఉన్న యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. అనంతరం అందులో పెట్టుబడి పెట్టించి.. రూ. 4.3 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసులు నమోదు చేసుకున్న సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆశపడ్డాడు.. స్వాహా అయింది..
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ప్రయత్నంలో ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. నారాయణగూడ పీఎస్ సీఐ భూపతి గట్టుమల్లు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌లో నివాసముండే గోవింద్ వాట్సాప్ నంబర్‌కు ఇటీవల ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగానే.. అందులో పెట్టుబడికి రెట్టింపు స్థాయిలో లాభాలు వస్తాయని సందేశం ఉంది. మొదటి ప్రయత్నంగా ఆ యువకుడు రూ.200 పెట్టగా రూ.344 వచ్చాయి. తర్వాత విడతల వారీగా రూ.55 వేలు డిపాజిట్ చేయడంతో అతడి ఖాతాలోకి డబ్బులు రాలేదు. మోసపోయినట్లు గ్రహించిన గోవింద్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.