Neem Karoli Baba | బాలీవుడ్ దర్శకుడు విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఆధ్యాత్మిక డ్రామా చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రూ. 50 కోట్ల మార్కును దాటింది. ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రం ఎలాంటి భారీ అంచనాలు లేకుండా వచ్చి సైలెంట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సాధించిన విజయంతో మేకర్స్ సీక్వెల్‌ను ప్రకటించారు.
చిత్రం క్లైమాక్స్ లో నీమ్ కరోలి బాబా కథ ఇంకా పూర్తి కాలేదనే హింట్ ఇస్తూ సీక్వెల్ పై స్పష్టత ఇచ్చారు. ఆగ్రాలోని ఒక మల్టీప్లెక్స్ లో ప్రేక్షకులతో మాట్లాడిన దర్శకుడు విశాల్ చతుర్వేది, రెండో భాగంలో నీమ్ కరోలి బాబా జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను చూపించనున్నట్లు తెలిపారు. ఆయన జన్మస్థలమైన ఫిరోజాబాద్ తో పాటు ఆగ్రా, మధుర మరియు ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంతో ముడిపడి ఉన్న ఇతర ప్రాంతాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది.
ఈ చిత్రాన్ని మొదటగా మూడు భాగాలుగా తెరకెక్కించాలని తాను భావించినట్లు దర్శకుడు తెలిపాడు. ఇక ఈ ఆధ్యాత్మిక కావ్యం విశాల్ చతుర్వేది రాసిన ‘డివైన్ డిసౌర్’ పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో నీమ్ కరోలి బాబా పాత్రలో నటుడు శోభినావ్ సత్యా నటించారు. చందన్ ఆనంద్, పూర్ణిమ తివారీ, విహాన్ శెడ్గే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా తొలి రోజు కేవలం రూ. 10 లక్షలు మాత్రమే రాబట్టింది. మొదటి రెండు వారాల్లో రూ. 1.40 కోట్లు మాత్రమే వసూలు చేసినప్పటికీ, మూడో వారంలో పాజిటివ్ టాక్ కారణంగా రూ. 10.40 కోట్లు రాబట్టి పుంజుకుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా భారతదేశంలో రూ. 54.74 కోట్ల నెట్ వసూళ్లను సాధించి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మరోవైపు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఇది సినిమా కాదు, ఓ సత్సంగ్. నీమ్ కరోలి బాబా అనుభూతులను అద్భుతంగా చూపించారు అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.