బ్యాంకాక్: అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్(USS Abraham Lincoln).. థాయ్‌ల్యాండ్‌లోని పటాయాకు చేరుకున్నది. సుమారు 5 వేల మంది సిబ్బందితో ఆ యుద్ధనౌక.. పశ్చిమాసియా తీరం నుంచి తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. దాదాపు 250 రోజులుగా రికార్డు స్థాయిలో యుద్ధనౌక అబ్రహం లింకన్ సముద్రంలోనే ఉన్నది. దీంతో ఆ యుద్ధనౌకలో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఇటీవలే యుద్ధనౌక లింకన్ వెనుదిరుగుతోంది.
ప్రస్తుతం పటాయా బీచ్ రిసార్టు సమీపంలో ఆ నౌకను డాకింగ్ చేశారు. నైట్‌లైఫ్, సెక్స్ టూరిజంకు కేంద్రమైన పటాయాలో యుద్ధనౌకను డాక్ చేయడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నది. సిటీలోని బార్లు, రెస్టారెంట్లు ఇప్పుడు బిజీ కానున్నాయి. గతంలో వియత్నాం వార్ సమయంలోనూ సేద తీరేందుకు ఇక్కడకు అమెరికా దళాలు వచ్చినట్లు తెలిసింది. అమెరికా సైనికులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో పటాయాలో వేశ్యల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు థాయ్ పోలీసులు అంచనా వేస్తున్నారు.
లాయిమ్ చాబాంగ్ వద్ద యుద్దనౌకను నిలిపారు. సైనికుల రాక సందర్భంగా సిటీలో పెట్రోలింగ్‌ను పెంచేశారు. బీచ్‌ఫ్రంట్, నైట్‌లైఫ్ ఏరియాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీకెండ్ తనిఖీల్లో సుమారు 50 మంది వేశ్యలను అదుపులోకి తీసుకున్నారు. టూరిస్టుల సంఖ్య పెరగడం వల్ల సిటీలో వ్యభిచారాన్ని అదుపు చేయడం కష్టమే అవుతుందని పటాయా పోలీసు చీఫ్ ఆనెక్ స్రాతోంగ్యూ తెలిపారు. పబ్లిక్ స్థలాల్లో కస్టమర్ల కోసం సెక్స్ వర్కర్లు ఎదురుచూసే అవకాశాలు పెరుగుతాయన్నారు.