ఖైరతాబాద్, మే 7: బీసీ కులగణన తప్పులతడకగా చేసి.. ఆ వర్గాలకు ఏదో చేస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని బీసీ సంఘాల సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. లక్డీకాపూల్లోని హోటల్ అశోకలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావు అధ్యక్షతన బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీలపై కాంగ్రెస్ అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.
సమావేశంలో పాల్గొన్న శాసనమండలి ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ..కేంద్రం చేపట్టే కులగణన అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా చూడాలన్నారు. రాష్ట్రంలో కులగణనను చేస్తామంటే రేవంత్ రెడ్డి మాటలను నమ్మేందుకు సిద్ధంగా లేమన్నారు. నమ్మకం ద్రోహం కాంగ్రెస్ నైజం అన్నారు. తొలుత కులగణన చేస్తామని, 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ..
బీసీలందరూ ఉద్యమిస్తే కాని కులగణన చేపట్టలేదన్నారు. అది కూడా తప్పుల తడకగా చేశారని మధుసూదనాచారి ఆరోపించారు. అనంతరం పలు తీర్మాణాలను ప్రవేశపెట్టారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు సత్యం, నాయకులు.. ఆనంద్ గౌడ్, వెంకటేశ్, మల్లేశ్, రామకృష్ణయ్య, అంజి, అనంతయ్య, సతీశ్, రామకోటి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.