సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యల పరిష్కారానికి స్టార్ హాస్పిటల్లో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నట్లు ఇంటర్నల్ మెడిసిన్-డయాబెటాలజి సీనియర్ కన్సల్టెంట్ డా.సందీప్ ఘంటా తెలిపారు. సాధారణంగా వృద్ధుల్లో మల్టీమార్బిడిటీ (ఒకేసారి అనేక దీర్ఘకాలిక వ్యాధులు రావడం) కేసులు పెరుగుతున్నాయని.. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, ఆర్థరైటిస్, గుండె జబ్బులు, శ్వాస సమస్యలు, మూత్రపిండ సమస్యలు వంటివన్నీ ఒకేసారి కలిసి వచ్చినప్పుడు బాధిత రోగి జీవనం క్లిష్టంగా మారుతుందని, అలాంటి వారికి మెరుగైన చికిత్స, సరైన సంరక్షణ ఎంతో అవసరమన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని స్టార్ హాస్పిటల్స్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్ కేర్‌ను ప్రారంభించినట్లు వివరించారు. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ అనేక రుగ్మతలు రావడం సహజమని, అయితే ఈ రుగ్మతలు ఒకదానిపై మరొకటి పరస్పరం ప్రభావం చూపుతుంటాయన్నారు. ఒక రోగానికి ఇచ్చే మందులు మరొక రోగానికి హాని కలిగించే అవకాశముంటుందని,ఎకువ మందులు వాడటం, తరచు పరీక్షలు చేయించుకోవాల్సి రావడంతో తరచూ దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు.
దీనివలన అటు రోగితో పాటు ఇటు వారి కుటుంబ సభ్యులు సైతం ఆర్థిక, మానసిక వత్తిడికి గురికావాల్సి వస్తుందన్నారు. అందువల్ల మల్టీమార్బిడిటీ నిర్వహణలో వైద్య చికిత్సతో పాటు రోగికి సంబంధించిన మొత్తం సంరక్షణ అవసరమని డా.సందీప్ వివరించారు. ఈ క్రమంలో స్టార్ హాస్పిటల్లో చికిత్సతో పాటు రోగులకు కుటుంబ సభ్యుల్లా ఇక్కడి వైద్య సిబ్బంది సేవలందించడం, అన్ని విభాగాలకు సంబంధించి వైద్యులతో మల్టీ స్పెషాలిటీ బృందాలు పనిచేయడం, వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించడం, అవసరమైన వారికి ఫిజియోథెరపి,పునరావాసం, సహాయక సేవలు, మానసిక ఆరోగ్యానికి కౌన్సెలింగ్ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు.