సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటమే కాకుండా, తెరవెనుక వందల కోట్లు కూడబెడుతూ అవినీతి సామ్రాజ్యాలను నిర్మిస్తున్న అవినీతి అధికారులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా అవినీతి అధికారుల గుట్టు విప్పేందుకు ఏసీబీ సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నది. ఫోన్ మ్యాపింగ్‌తో అవినీతికి పాల్పడిన అధికారుల బినామీలు ఎవరు, ఎక్కడ ఆస్తులు కూడ బెట్టారనే విషయాలను వెలుగులోకి తేవడంపై దృష్టి పెట్టారు.
అవినీతి అధికారుల ఆటకట్టించేందుకు ఏసీబీ సరికొత్త టెక్నాలజీని వినియోగించేందుకు సిద్ధ మైంది. ఇటీవల ఏసీబీ వలలో చిక్కిన అవినీతి తిమంగలాల ఇళ్లలో బయటపడుతున్న వందల కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల చిట్టాలు చూసి విస్మయం చెందుతున్న అధికారులు, ఆ అక్రమ సామ్రాజ్యాల మూలాలను వెలికి తీసేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. లంచాల కోసం వాడుతున్న కోడ్ వర్డ్స్ నుంచి బినామీలతో చీకటి లావాదేవీల వరకు ప్రతి అంశాన్ని వెలికితీసే దిశగా చర్యలు చేపట్టారు. అయితే అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలెత్తిన లంచావతరాలు.. దర్యాప్తు సంస్థల కండ్లు గప్పేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. వారు ఫోన్లలో మాట్లాడే సమయంలో లంచానికి వివిధ రకాల కోడ్ వర్డ్స్ వాడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. బినామీలుగా అనుమానిస్తున్న వారి తో వాట్సాప్ కాల్స్ సంభాషణలు, ప్రత్యేక నంబర్లను ఉపయోగిస్తూ మాట్లాడటం వంటి ఆధారాలను ఏసీబీ సేకరించింది.
ఇటీవల ఏసీబీ దాడుల్లో పట్టుబడిన పలువురు బడా అవినీతి అధికారుల అవినీతి చిట్టా రూ.500 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఇంత భారీ స్థాయిలో ఆస్తులను కూడా బెట్టడం వెనుక ఉన్న నెట్వర్క్ అంతా వీరి ఫోన్లలోనే దాగి ఉందని ఏసీబీ బలంగా నమ్ముతోంది. గతంలో అవినీతి సొమ్మును బంధువులు, స్నేహితుల సర్కిళ్లలోనే కూడబెట్టేవారు. కానీ ఏసీబీ విచారణలో సులువుగా దొరికిపోతుండటంతో, అవినీతి డబ్బును తమ సొంత పరిధిలో కాకుండా కొత్త సర్కిల్‌లోకి డంప్ చేస్తున్నారని ఏసీబీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగా కొత్తవారు, అనామకులను బినామీలుగా ఎంచుకొని వారి దగ్గర అవినీతి సొమ్మును దాచిపెడుతున్నారనే కోణంలో ఏసీబీ ఆరా తీస్తోంది. ఇటీవల ఏసీబీ దాడుల్లో బయటపడిన బీనామీల పేర్లు, వారి ఫోన్ నంబర్లను ఏసీబీ విశ్లేష్తోంది.
అవినీతి అధికారులకు, బినామీలకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫోన్ కాల్ విశ్లేషణ ద్వారా పట్టుబడిన అధికారి సదరు బినామీలతో ఎన్నిసార్లు మాట్లాడారు, వారితో చేసిన వాట్సాప్ చాటింగ్, భారీ నగదు బదిలీలు జరిగిన తేదీలలో వీరి మొబైల్ సిగ్నల్స్ ఎక్కడెక్కడున్నాయి అన్న కోణంలో కాల్ డేటా రికార్డులను ఏసీబీ మ్యాపింగ్ చేస్తోంది. రెవెన్యూ మున్సిపల్, పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖలలో పనిచేసి పట్టుబడిన ప్రతి అధికారి కేసులోనూ ఇదే తరహా దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీబీ తీసుకుంటున్న ఈ సాంకేతిక దూకుడు చర్యలతో అవినీతి అధికారులలో వణు కు పుడుతోంది. ఆధారాలను డిలీట్ చేశాం కదా అని ధీమాగా ఉన్న అక్రమార్కులకు.. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. పక్కా ఆధారాలతో ఏసీబీ విసురుతున్న టెక్ వలకు రానున్న రోజుల్లో మరిన్ని అవినీతి తిమింగలాలు చిక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
బినామీలతో మాట్లాడిన కోడ్ భాషను డీకోడ్ చేస్తూ అక్రమ వసూళ్లకు, బినామీలకు మధ్య జరిగిన లావాదేవీలపై ఏసీబీ లోతుగా ఆరా తీస్తోంది. విచారణలో నాకేం తెలియదంటూ బుకాయించే అవినీతి అధికారుల నోరు మూయించడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో స్వాధీనం చేసుకున్న అవినీతి అధికారుల ఫోన్లలలో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసేందుకు ఫోరెన్సిక్ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏసీబీ స్వాధీనం చేసుకున్న ఫోన్లు ఎన్నిసార్లు ఫార్మాట్ చేశారు, వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్స్‌లలో చాట్లను ఎన్నిసార్లు డిలీట్ చేశారు, క్లియర్ చాట్ ఆప్షన్ ద్వారా ఏయే ఆధారాలను చెరిపేశారు? డిలీట్ అయిన ఆర్థిక లావాదేవీల చిట్టాను రికవరీ చేయడం ఎలా? అనే విషయాలపై ఫోన్ ఇమ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆయా మొబైల్స్ నుంచి సమగ్రమైన డేటాను రికవరీ చేస్తున్నారు.