బేగంపేట్ : బేగంపేట్ నాలా పరిసర ప్రాంతాల వారు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం సూచిస్తూ కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈ నెల 12న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పేర్కొన్నారు.
మంగళవారం మారేడ్‌పల్లిలోని తన నివాసంలో బేగంపేట్, రాంగోపాల్‌పేట్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12న ముందుగా రాంగోపాల్‌పేట్ పరిధిలోని ఎస్పీ రోడ్డు కరాచీ బేకరీ వద్ద ఉన్న పికెట్ నాలాపై రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వంతెన పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని, అనంతరం పాటిగడ్డలో రూ. 6 కోట్ల వ్యయంతో చేపడుతున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు పనులకు జరిగే శంకుస్థాపనలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కూడా పాల్గొంటారని వివరించారు.
రూ. 45 కోట్ల వ్యయంతో బేగంపేట్ నాలాకు రీటైనింగ్ వాల్‌తో పాటు వరదనీటి పైపులైన్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరుగుతుందని వివరించారు. బేగంపేట్‌లో వరద ముంపు సమస్యను గతంలో ఏ ప్రజాప్రతినిధి కనీసం పరిష్కరించే ప్రయత్నాలు కూడా చేయలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో వందలాది కోట్లతో అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని వివరించారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, రాంగోపాల్‌పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, టీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు అత్తెల్లి శ్రీనివాస గౌడ్, శ్రీహరి, శేఖర్, నాయకులు అక్బర్, కిశోర్, మనోజ్, శ్రీనివాస్ గౌడ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.