రవీంద్రభారతి, ఆగస్టు 10: బహుజన రాజ్యస్థాపకుడు, బడుగుబలహీన వర్గాల పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను నేటి తరం యువత స్ఫూర్తిగా తీసుకోవాలని బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ(ఎస్పీడీపీఓ), జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి జాతీయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
జై గౌడ్ ఉద్యమ వ్యవస్థాపక అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ సభా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వక్తలుగా మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహాష్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగు రమేష్, మాజీ ఎంపీ భరత్‌గౌడ్, గుల్బర్గా ఎమ్మెల్సీ జయదేవ్ గుత్తా, శ్రీకాంత్‌గౌడ్ ఇతర జాతీయ గౌడ సంఘం నేతలు హాజరై సర్వాయి పాపన్నగౌడ్ మహారాజ్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ బడుగుబలహీన వర్గాలను ఏకంచేసి గోల్కొండ రాజ్యాన్ని ఏలిన పోరాట యోధుడని కొనియాడారు. సర్వాయిపేటలో పాపన్నగౌడ్ కోటకు రూ.5 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.ఈనెల 17న సైదాపూర్‌లో పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణకు పీసీసీ అధ్యక్షుడితో కలిసి హాజరవుతామన్నారు.
42శాతం రిజర్వేషన్ సాధనే లక్ష్యం..
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బహుజన రాజ్యస్థాపకుడు పాపన్నగౌడ్ గౌడ కులస్థులతో పాటు యావత్తు బడుగుబలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పడే గౌడ కులస్థులకు వైన్స్‌లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ఆత్మగౌరవ భనాల కోసం 5 ఎకరాల స్థలం, నిధులు మంజూరు చేయించానని, పాపన్న విగ్రహం ట్యాంక్‌బండ్‌పై పెట్టడానికి కృషిచేశానని తెలిపారు.
కులబాంధువులే తాను ఓడిపోయినప్పుడు తనకు ఆత్మసైర్యం కూడా కల్పించలేదని, మనవాళ్లే మన ఎదుగుదలను ఓర్వలేక ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కల్లు కంపౌండ్ల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో రాజీపడలేదని ఆయన స్పష్టం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరుగని పోరాటం చేస్తానని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. సభకు ముందు పాపన్నగౌడ్ జీవిత చరిత్రకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రదర్శన చేపట్టారు.