ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 5: ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వర్సిటీ విద్యార్థులకు ఫుల్ మెస్ చార్జీల పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ఘనంగా బీసీ విద్యార్థి మహాసభను నిర్వహించారు. తెలంగాణ బీసీ విద్యార్థి సం ఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యం లో నిర్వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. ఫుల్ మెస్ చార్జీలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. రాష్ట్రంలో 300 బీసీ కళాశాలల హాస్టళ్లు ఉంటే ఒక్క దానికి కూడా సొంత భవనం లేదని గుర్తు చేశారు.
కళాశాల హాస్టల్ విద్యార్థులకు బస్పాస్, ఇతర చిల్లర ఖర్చులకు ప్రతి ఒక్కరికి నెలకు బాలికలకు రూ.1000, బాలలకు రూ.800 పాకెట్ మనీ మంజూరు చేయాలని అన్నారు. అన్ని ప్రొఫెషనల్ కోర్సులు, ఇంటర్మీడియల్ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కోర్సుల ఫీజుల గరిష్ట పరిమితి ఎత్తివేయాలని కోరారు. ఫీజు బకాయిలను తక్షణమే ఒకేదఫా చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా 150 బీసీ కళాశాలల హాస్టళ్లు మంజూరు చేయాలని అన్నారు. ప్రతీ హాస్టల్కు కంప్యూటర్లు సమకూర్చాలని చెప్పారు.