చిక్కడపల్లి, సెప్టెంబర్ 30: డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుతున్న 16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజుల రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఫ్రంట్, తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కాలేజీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు 4,500 కోట్లు చెల్లించాలని, స్కాలర్ షిప్లు పెంచాలని సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
ధర్నాకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు మూడేండ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించక పోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు పూర్తి చేసినా సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఒక వైపు విద్యార్థులు ఇంకో వైపు కాలేజీ యాజమన్యాలు తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు.
ఫీజుల బకాయిల కారణంగా సర్టిపికెట్లు రాక అటు ఉన్నత చదువులు చదవలేక ఇటు ఉద్యోగాలు పొందలేని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వ వ్యతిరేక వైఖరి విడనాడి వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో బసీ సంఘం నాయకులు గోరేగే మల్లేశ్, గుజ్జ సత్యం, నీల వెంకటేశ్, అంజి, అనంతయ్య, రాజేందర్, రాంకోటి, నందా గోపాల్, రామ్ మూర్తి, సతీశ్, పవన్, ప్రీతం, హరీశ్, రవి, రమ్ దేవ్ మోదీ, ప్రభాకర్, కోటేశ్వరి పాల్గొన్నారు.