బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:14:27

చదువులమ్మ చెట్టు నీడలో..

చదువులమ్మ చెట్టు నీడలో..

  • ఉద్యోగార్థులకు అండగా బీసీ స్టడీ సర్కిళ్లు
  • పోటీ పరీక్షల్లో గెలిచేందుకు ప్రత్యేక శిక్షణ
  • 1,486 మందికి దక్కిన సర్కారీ కొలువులు

పోటీ పరీక్షలకు కోచింగ్‌ అంటే.. వేలకు వేలు ఖర్చు పెట్టాలి. డబ్బు పెట్టి చదువుకొనే స్థోమత లేని ఎంతోమంది ప్రతిభావంతులు సరైన శిక్షణ లేక ఉన్నత పదవులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోయారు. నిరుద్యోగులుగానే ఉండిపోయారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి వందలాది మంది పేదలు అత్యున్నత సర్వీసులకు ఎంపికయ్యేలా చొరవ చూపిస్తున్నది. వారి జీవితాలను బంగారుమయం చేస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ నుంచి అత్యున్నత సర్వీసు అధికారులను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్టడీ సర్కిళ్లను సమర్థంగా నిర్వహిస్తున్నది. జాతీయ, రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు పోటీపడుతున్న బీసీ ఉద్యోగార్థులకు స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ప్రైవేటు స్టడీ సర్కిళ్లలో రూ.వేలల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న బీసీ నిరుద్యోగులకు స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ అందిస్తూ రాష్ట్ర సర్కారు అండగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారిలో 1,486 మంది ఉన్నతస్థాయి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు పొందారు. యూపీఎస్సీ నోటిఫికేషన్లు, సివిల్స్‌లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే, బ్యాంక్‌, టీఎస్‌పీఎస్సీ, పోలీస్‌ కానిస్టేబుల్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, వీఆర్వో, వీఆర్‌ఏ, సింగరేణి, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్‌ వన్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్సెస్సీ, ఫారెస్ట్‌, ఇతర ఉద్యోగాల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని 18 బీసీ స్టడీ సర్కిళ్లలో నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంతోపాటు వసతి, భోజనం, గ్రంథాలయం, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌, లైబ్రరీ, పుస్తకాల కొనుగోలు నిధి వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు.

సివిల్స్‌ శిక్షణ

పేద కుటుంబాల నుంచి ఎక్కువ మందికి ఉన్నతస్థాయి ఉద్యోగావకాశాలు దక్కాలని ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించింది. సివిల్స్‌ సాధించడం అందరికీ ఏడాదిలో సాధ్యమయ్యే పని కాదని, కనీసం మూడేండ్లు పడుతుందని నిర్ణయించింది. శిక్షణ పూర్తైన తర్వాత ప్రిపరేషన్‌ కోసం సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా అదనపు తరగతులకు అవకాశం ఇవ్వటంపై అధికారులు దృష్టి సారించారు. తద్వారా అభ్యర్థులు ర్యాంకులు సాధించటంతోపాటు మిగిలిన బ్యాచ్‌లకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు.