రవీంద్రభారతి, మార్చి29 : రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసనసభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడు నరసింహానాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా శనివారం బషీర్‌బాగ్‌లో నరసింహానాయక్ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం తెస్తాం లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంచుతామని చెప్పి ఓట్లతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి లంబాడీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
లంబాడీల కంటే జనాభా తక్కువ ఉన్న ఓ వర్గానికి ఐదు మంత్రి పదవులు, 20కి పైగా కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారని, 10 శాతం ఉన్న లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం లంబాడీ జాతిని అవమానించడమేనని, 60 నియోజకవర్గాలలో అత్యధికంగా లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకువచ్చిన లంబాడిలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇక్వపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన లండాలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంత్రి వర్గ విస్తరణలో లంబాడీలకు స్థానం కల్పించారని, చందులాల్, సత్యవతి రాథోడ్‌కు చోటు కల్పించిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. కేసీఆర్ హయాలో లంబాడీలకు స్వర్ణయుగంగా ఉండేదని ఆయన స్పష్టం చేశారు. మాయమాటలు చెప్పి ఓటువేసినందుకు లంబాడీలకు కాంగ్రెస్‌పార్టీ వెన్నుపోటు పొడిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ లంబాడీల ఆగ్రహానికి గురికాకతప్పదన్నారు. కాంగ్రెస్‌పార్టీని నేతలను తండాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటామని నరసింహానాయక్ హెచ్చరించారు.