బన్సీలాల్‌పేట్: హుస్సేన్‌సాగర్‌లో పటాకుల పేలుడు ఘటనలో మృతి చెందిన చిలువేరు అజయ్ కుటుంబసభ్యులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారి బంధువులు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ దవాఖానలో అజయ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అజయ్ బంధువులు, మద్దతుదారులు మార్చురీ వద్ద గుమిగూడారు. కిషన్‌రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌లో జరిగిన భారతమాత ఫౌండేషన్ మహాహారతి కార్యక్రమం సందర్భంగా ఇద్దరు పౌరులు మృతి చెందినా.. ఇప్పటి వరకు ఒక్క రాష్ట్ర మంత్రిగాని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గాని రాలేదని, పేద ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నించారు.
అజయ్ తండ్రి జానకి రామ్ ఆటో నడుపుతూ.. కుమారుడిని బీటెక్ చదివిస్తున్నాడని, చెట్టంత కొడుకు మరణించగా, వారి కడుపుకోతను ఎవరు తీరుస్తారని అన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఇంత ఘోరం జరిగినా..ఒక్కరూ స్పందించకపోవడం, నైతిక బాధ్యత వహించకపోవడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, పది కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయం లభించేంత వరకు వారి కుటుంబానికి తాము అండగా నిలబడతామన్నారు.