ఖైరతాబాద్, మార్చి 22: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ సాకులు చెప్పి రిజర్వేషన్ల అమలును పక్కన పెట్టాలని చూస్తోందని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవోలు జారీ చేసి రిజర్వేషన్లను అమలు చేయాలని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ జనసభ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘బీసీ బిల్లు- స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో తక్షణమే రిజర్వేషన్ల అమలుకోసం ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు డి.రాజారాం యాదవ్ మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పాట పాడుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీపై రాజీలేని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ అంశాన్ని ఢిల్లీ వైపు మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతుందన్నారు.
అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సమగ్రకులగణన శాస్త్రీయమైందని అభిప్రాయపడ్డారు. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు బి. సంజీవ్ నాయక్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం వచ్చినప్పుడు అందరి బతుకులు మారుతాయన్నారు. హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ పటేల్ మాట్లాడుతూ కులగణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయకుంటే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది డాక్టర్ కదిరె కృష్ణ, విద్యావేత్త అశోక్, ఎంబీసీ కులాల జాతీయ కన్వీనర్ కొండూరి సత్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లంపల్లి రాంకోటి, పద్మశాలి సంఘం నాయకులు శ్రీనివాస్ నేత, తెలంగాణ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి మేకల కృష్ణ, బీసీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కర్నాటి శ్రీనివాస్, అంబేద్కర్ ఆజాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంగర నరహరి తదితరులు పాల్గొన్నారు.