రవీంద్రభారతి,మే3: కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తి వేయాలని భారీ కుట్రలు చేస్తుందని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ కృష్ణయ్య తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో బీసీ నేతలు నీల వెంకటేశ్,జిల్లపల్లి అంజి సభా అధ్యక్షతన 18 విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 30 నెలల కాలంలో విద్యకు బడ్జెట్ విడుదల చేయకుండా అన్యాయం చేశారని, కాంట్రాక్టర్లకు వేలాది కోట్ల రూపాయలు విడుదల చేస్తూ విద్యార్థుల చదువుల కోసం నిధులు విడుదల చేయమంటే డబ్బులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి బకాయింపు చేస్తూ పేద విద్యార్థుల నోట్లో మట్టికొడుతున్నారని భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
హైకోర్టులో బీసీ వ్యతిరేక అడ్వకేట్ జనరల్‌తో విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా జీవో 7ను తీసుకువచ్చిచదువులకు దూరం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అనేక మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పూర్తి బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డి వహించాలని అన్నారు. విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేసుకోవచ్చునన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం వెంటనే పుల్బెంచ్కు అప్పీల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేతలు నీల వెంకటేశ్, జిల్లపల్లి అంజి,గొరిక మల్లేశ్, రాజేందర్,అనంతయ్య, సదానంద్యాదవ్, విద్యార్థి నాయకులు రాకేశ్ దత్తా, చంద్రశేఖర్‌గౌడ్, శివకుమార్, అంజిగౌడ్, రాజేశ్‌యాదవ్,మేకల శ్రీనివాస్ పాల్గొన్నారు.