Chepa Prasadam | సుల్తాన్ బజార్, జూన్ 9: మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబం నిర్వహిస్తున్న చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. బత్తిని కుటుంబసభ్యుల నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఉదయం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేప ప్రసాదం పంపిణీ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 35 కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబసభ్యులు, వాలంటీర్లు చేప ప్రసాదం పంపిణీ చేశారు.
ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ ప్రాంతాల నుంచి చేపే ప్రసాదం కోసం ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుంటుండటంతో 24 గంటలు నిర్వహించాల్సిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం 3 గంటల వరకు పొడిగించారు. చేప ప్రసాదం ముగింపు సమయానికి 59,231 కొర్రమీను చేప పిల్లలను విక్రయించినట్లు మత్స్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, సుజాత తెలిపారు. దీంతో పాటు సుమారు 10 వేల మందికిపైగా శాఖాహారులకు బత్తిని కుటుంబసభ్యులు ప్రత్యేకంగా బెల్లం మందును పంపిణీ చేసినట్లుగా బత్తిని హరినాథ్ కుమార్తె హరితనంద తెలిపారు. మొత్తంగా చేప ప్రసాదం ముగింపు సమయానికి 30 గంటల్లో 70 వేల మంది చేప ప్రసాదం స్వీకరించినట్లు సమాచారం.
చేప ప్రసాదం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు నేపాల్, అమెరికాకు చెందిన పలువురు ఆస్తమా రోగులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుని చేప ప్రసాదం స్వీకరించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం లభించని వారికి దూద్‌బౌలి, కవాడిగూడ, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లోని బత్తిని వారి నివాసాల్లో రెండో రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు.