గ్రేటర్ పరిధిలోని పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు నాటి కేసీఆర్ ప్రభుత్వం 292 బస్తీ దవాఖానలను తీసుకొచ్చి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసింది. ప్రాథమిక వైద్యంతో పాటు 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. ప్రైవేటు దవాఖానల్లో లక్షల రూపాయలు ఖర్చు చేయలేని నిరుపేదలకు బస్తీ దవాఖానలు వరంగా మారాయి. మెరుగైన చికిత్స అందించే లక్ష్యంతో ప్రతి పదివేల మందికీ ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ను ఆరోగ్యబాద్‌గా మార్చే క్రమంలో బస్తీ స్థాయిలోనే రోగాలకు చెక్ పెట్టేందుకు వాటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. బస్తీ వాసులు, వలస కూలీలు, వేతన జీవులకు సకాలంలో మందులు అందజేస్తూ అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకున్నారు.
రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానలు నిర్లక్ష్యపు నీడలో కొనసాగుతున్నాయి. కనీస వసతులు లేకపోవడంతో, వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తున్నది. ప్రభుత్వం సకాలంలో నిధులు మంజూరు చేయకపోవడంతో అద్దె భవనాల్లోని దవాఖానలు మూతపడుతున్నాయి. మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన నిధులను కూడా విడుదల చేయకపోవడంతో సుస్తీ చేసింది. మందులు సకాలంలో రాకపోవడంతో కేసీఆర్ తీసుకొచ్చిన బస్తీ దవాఖానల లక్ష్యం నీరుగారుతున్నది. ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది.దవాఖానల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు.రోగులకు వారే చికిత్స చేస్తున్నారు.
– ఫీచర్స్ స్టోరీ
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి 292 బస్తీ దవాఖానలను నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక వైద్యుడు, సిబ్బందిని నియమించారు. ప్రాథమిక వైద్యంతో పాటు 55 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా అన్ని వసతులు కల్పించారు.అవసరమైన 125 రకాల మందులను అందుబాటులో ఉంచేది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సేవలను పటిష్టం చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బస్తీ దవాఖానలను గాలికి వదిలేసింది. సిబ్బంది కొరత, నిధుల నిలిపివేతతో దవాఖానలు విలవిలలాడుతున్నాయి.
కొన్ని చోట్ల కనీస వసతులు లేకపోవడంతో రోగులు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిద్దరు సిబ్బంది ఉండటంతో సకాలంలో రోగులకు చికిత్స అందించలేకపోతున్నారు. దవాఖానల్లో మందులు ఉండకపోవడంతో పేదలు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పైసా ఖర్చు లేకుండా వైద్యం అందేదని కాంగ్రెస్ వచ్చిన రెండేండ్ల నుంచి వేలాది రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సులే ..వైద్యులుగా..
దవాఖానల్లో వైద్యులు లేకపోవడంతో నర్సులే డాక్టర్ల అవతారమెత్తుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో వస్తున్న రోగులకు వారే చికిత్స అందిస్తున్నారు. మొత్తం 292 బస్తీ దవాఖానల్లో హైదరాబాద్ పరిధిలోని 169 మినహా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని 123 బస్తీ దవాఖానల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. మేడ్చల్ జిల్లాలోని 112 బస్తీ దవాఖానలకు 5 కేంద్రాల్లో వైద్యులే లేరు. మరికొన్ని బస్తీ దవాఖానల్లో కేవలం ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడంతో వారు సెలవుపై వెళ్లిన సమయంలో అక్కడ కూడా నర్సులే దిక్కవుతున్నారు.
రోగులు తమ వ్యాధి లక్షణాలు చెబితే వారికి ఉన్న అవగాహన మేరకు మందులు ఇచ్చి పంపిస్తున్నారు. సరైన చికిత్స అందక రోగులు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని బస్తీ దవాఖానల్లో నమూనాలు సేకరించేందుకు అవసరమైన సిబ్బంది లేక 55 రకాల వైద్యపరీక్షలకు గాను పరిమితంగా అతి తక్కువ వైద్యపరీక్షలు చేస్తున్నారు. మరికొన్ని దవాఖానల్లో వైద్యపరీక్షల కోసం వచ్చే రోగులకు ఇతర కేంద్రాలకు లేదా ప్రైవేటు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
నీళ్లులేవు.. టాయిలెట్స్ కరువు
మారేడ్‌పల్లిలోని అంబేద్కర్ నగర్ బస్తీ దవాఖానలో కనీస వసతులు లేకపోవడంతో ఆ ప్రాంతంలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు లేవు. పరీక్షలు చేయడానికి పరికరాలు లేకపోవడంతో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సి వస్తున్నది. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు, వైద్యులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దవాఖాన ముందు డ్రైనేజీ కోసం తవ్వి వదిలేయడంతో వృద్ధులు, దివ్యాంగులతో పాటు అనారోగ్యం బారిన పడ్డవారు వైద్యం కోసం రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు, సిబ్బంది కూడా మధ్యాహ్నం తర్వాత దవాఖానలో ఉండటం లేదని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మధ్యాహ్నం దాటితే తాళం వేసి వెళ్తున్నారని వాపోతున్నారు. రోజుల తరబడి ఇలానే ఉండటంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
బస్తీ దవాఖానలో చెత్త డబ్బాలు..
సికింద్రాబద్ పరిధిలోని ఆధేయనగర్ గ్యాస్‌మండి బస్తీ దవాఖాన పరిసరాల్లో పక్కన ఉన్నవాళ్లు ఖాళీ ప్రదేశంలో ఇంటి సామగ్రి, చెత్త డబ్బాలు పెట్టారు. కొద్దిరోజులుగా అక్కడే ఉండటంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయని వైద్యం కోసం వచ్చిన వారు వాపోతున్నారు. సామగ్రిని అక్కడి నుంచి తొలగించాలని వైద్యులు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదని చెప్పారు.