సిటీబ్యూరో, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ): సైబర్నేరాలను అడ్డుకోవడంలో బ్యాంకుల పాత్ర కూడా కీలకంగా ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. బుధవారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బ్యాంకు అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సైబర్నేరాలను నివారించడంలో బ్యాంకు అధికారుల పాత్రపై చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బ్యాంకుల్లో ఖాతాలు, హెల్ప్‌డెస్క్‌లు, అకౌంట్స్ లావాదేవీల పరిమితి, ఆలస్యమైన, గడువు ముగిసిన లావాదేవీలను నియంత్రించే వ్యవస్థను, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్‌తో సైబర్‌నేరగాళ్లు చేతికి బాధితుల డబ్బు చేరకుండా చేసే విధానాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తు, బాధితులకు రీఫండ్‌కు సంబంధించిన అంశాలలో సహకరించే విధంగా వ్యవస్థను తయారు చేయాలని సూచించారు.
సాధారణ నేరాలు తగ్గుతూ సైబర్‌నేరాలు పెరుగుతున్నాయని, గత ఏడాది 48 శాతం సైబర్‌నేరాలు పెరిగాయన్నారు. కొన్ని సైబర్ నేరాలలో బ్యాంకుల ద్వారానే బాధితులు సైబర్ నేరగాళ్లకు సంబంధించిన ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేస్తుంటారని, అలాంటి వారిని గుర్తించడం, ఆయా ఖాతాల నుంచి జరిగే అనుమానిత లావాదేవీలపై ఖాతాదారులను అప్రమత్తంగా ఉంచడంలో బ్యాంకు అధికారులు, సిబ్బందిదే కీలక పాత్ర ఉంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవడం వల్ల సైబర్నేరాలను అడ్డుకునే అవకాశం ఉంటుందని సీపీ సూచించారు.