Cyber Crime | సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సైబర్‌నేరగాళ్లు బ్యాంకు ఖాతాల కోసం అమాయకులు, కార్మికులను సైతం టార్గెట్ చేస్తున్నారు. అమాయకులకు ఫోన్లు చేసి.. ‘మీరు బ్యాంకు ఖాతా ఇవ్వండి.. అందులో డిపాజిట్ అయిన సొమ్ములో 1 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇస్తాం.. మాది సాఫ్టువేర్ సంస్థ.. గేమింగ్ కంపెనీ’.. అంటూ నమ్మిస్తూ ఖాతాదారులను ఆకర్షిస్తున్నారు. సైబర్‌నేరాల్లో నిందితులకు బ్యాంకు ఖాతాలే కీలకం. నేరగాడు ఎక్కడి నుంచైనా మెసేజ్ పంపిస్తాడు.. ఫోన్ చేస్తాడు.. కానీ, బ్యాంకు ఖాతా మాత్రం భారతదేశంలోనే ఉంటుంది.
ఈ నేపథ్యంలో సూత్రధారులు విదేశాల్లో ఉంటూ బ్యాంకు ఖాతాల కోసం ఎక్కడికక్కడ కమీషన్ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. ఈ కమీషన్ ఏజెంట్లు వివిధ కోణాల్లో అమాయకులకు వల వేస్తూ బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నారు. ఇందులో బ్యాంకు ఖాతాలు ఇచ్చినందుకు కొంత కమీషన్ తీసుకుంటున్నారు. ఇలా కమీషన్ కోసం కక్కుర్తి పడుతున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు అందిస్తూ.. సైబర్‌నేరాల్లో నిందితుల వరసలో నిలబడుతున్నారు.
ఈశాన్య రాష్ర్టాలు, యూపీ, జమ్మూ కశ్మీర్, బీహర్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ.. ఇలా అన్ని రాష్ర్టాల్లో సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందించే కమీషన్ ఏజెంట్ ముఠాలు ఉన్నాయి. కేవలం ఖాతా తెరిచి ఇస్తే చాలు.. అందులో డిపాజిట్ అయ్యే సొమ్ములో 10 శాతం తీసుకొని మిగతా సొమ్ము మాకు ఇవ్వాలంటూ.. ఏజెంట్లు బ్యాంకు ఖాతాదారులను ఆశ్రయిస్తున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మిన అమాయకులు కమీషన్ కోసం ఆశపడి జైలు పాలవుతున్నారు.
ఇటీవల ఓల్డ్‌సిటీలో పెయింటింగ్ పనులు చేసుకునే ఇద్దరు సోదరులకు రాజస్థాన్, గుజరాత్ నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. మాది సాఫ్ట్వేర్ సంస్థ.. గేమింగ్ సాఫ్ట్వేర్ రూపొందిస్తాం.. దేశ వ్యాప్తంగా గేమింగ్ సాఫ్ట్వేర్ వాడుతున్న వినియోగదారులు డబ్బులను బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తారు.. మీరు బ్యాంకు ఖాతా ఇస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. అంటూ ఫోన్ చేశారు. మీరు మా దగ్గరే ఉండండి.. మీరు గుజరాత్ రావడానికి విమానం టికెట్లు బుక్ చేస్తున్నాం.. మీ బ్యాంకు ఖాతాల చెక్ బుక్‌లు, ఏటీఎం కార్డులు తీసుకొని రావాలి.. అంటూ సూచించారు.
ఈ క్రమంలోనే ఇద్దరు సోదరులు సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు గుజరాత్‌కు వెళ్లడంతో.. అక్కడ ఒక హోటల్లో రూమ్‌ను కేటాయించారు. వారిద్దరి బ్యాంకు ఖాతాల్లో రూ. 6 కోట్లు డిపాజిట్ అయ్యాయి. హోటల్లో ఉండగానే ఇంత డబ్బు డిపాజిట్ కావడంతో ఇద్దరు సోదరులు భయపడ్డారు. మీకేం కాదు.. అంటూ ఇద్దరు సోదరులకు సైబర్‌నేరగాళ్లు సూచించారు. అందులో రూ.6 లక్షల నగదు ఇచ్చి, మిగతాది ఖర్చుల కింద జమ అయ్యిందంటూ నచ్చజెప్పారు. అప్పటికే బ్యాంకు ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ అవుతుండటంతో బ్యాంకు నుంచి ఫోన్ కూడా వచ్చింది.
అయినా, సైబర్‌నేరగాళ్లు మాత్రం ఖాతాదారుల్లో ధైర్యం నింపుతూ.. మీకు ఏమీ కాదంటూ.. భరోసా ఇచ్చారు. మీకు భయమైతే మీరు వెళ్లిపోండి.. అంటూ ఇద్దరిని తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. అయితే, గుజరాత్లో కేసు నమోదు కావడంతో ఇద్దరు బ్యాంకు ఖాతాదారులైన సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌నేరగాళ్లు ఇచ్చిన రూ. 6 లక్షల నగదు కోర్టు ఖర్చులకే వెచ్చించారు. ఈ విధంగా సైబర్‌నేరగాళ్లు అమాయకులను తమకు కావాల్సినట్లుగా వాడుకుంటున్నారు. కమీషన్లకు ఆశపడి బ్యాంకు ఖాతాలను ఇతరులకు ఇవ్వవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.