సిటీబ్యూరో: నగరాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించడం, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టాల్లో మేయర్ అండగా నిలబడాలి.. కానీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లోనే ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అంతుచూస్తామనే రీతిలో బెదిరింపులు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్న గ్రూప్‌లో మేయర్, ఆమె మనుషులు ప్రశ్నించే గొంతుకలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
హౌస్ ఓనర్స్‌గా ఏర్పడిన గ్రూప్ రాజకీయ పార్టీల మధ్య విభేదాలుగా మారి..చివరకు మేయర్ మనుషులు జరిపిన దాడితో అవమానభారంతో బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త పావని ఆత్మహత్యకు యత్నించారు. మేయర్ మనుషులు పావనిని కొట్టి రోడ్డు మీదకు తీసుకువచ్చి దుర్భషలాడారని, దీంతో మనస్థాపానికి గురైన పావని.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు పావని బంధువులు తెలిపారు. పావని మనుషులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్త రాజు ముదిరాజ్ సైతం మేయర్ మనుషులతో ప్రాణహాని ఉన్నదని పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కారు.
అసలేం జరిగిందంటే.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఎన్బీటీనగర్ బస్తీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నివాసం ఉంటుంది. ఈ బస్తీకి సంబంధించి 850 మంది ఇంటి యజమానులు, అధికారులు కలిసి ఓ వాట్సాప్ (ఎన్బీటీ నగర్ హౌస్ ఓనర్స్) గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో పలు సమస్యలపై బస్తీ వాసులు గ్రూప్‌లో పోస్టు చేయడం, అధికారులు సమాధానం చెప్పడం వంటివి కొంతకాలంగా జరుగుతూ వచ్చింది. ఈ గ్రూప్‌లో మేయర్ కూడా ఒక సభ్యురాలుగా ఉన్నారు. నాలుగు రోజుల కిందట బీజేపీ నాయకురాలు పావని సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు.
గ్రూపులో విమర్శలు వద్దని మెజార్టీ సభ్యులు రిైప్లె ఇవ్వడంతో పావని పోస్టు తప్పుగా చేశానని.. బదులు ఇవ్వడంలో ఇక్కడ చర్చకు ఫుల్స్టాప్ పడింది. గురువారం పావని ఇంట్లో ఉండగా, మేయర్‌కు చెందిన మనుషులు ఆమెను కొట్టి రోడ్డు మీదకు తీసుకువచ్చి దుర్భషలాడారు. మనస్థాపానికి గురైన పావని.. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఆమె తరపున కొందరు మేయర్ మనుషులపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బస్తీలో ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న ఖాళీ మైదానంలో కొంత మంది అక్రమంగా పార్కింగ్ చేసుకొని గంజాయి వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తుండడంతో బస్తీ వాసులంతా కలిసి నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశామని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసేందుకు మేయర్ రాగా…ఆమె అనుచరులు నో పార్కింగ్ బోర్డును కాలితో తన్నడంతో పాటు బెదిరింపు ధోరణితో మాట్లాడారని బాధితులు చెబుతున్నారు. మేయర్ మనుషులు తన ఇంటిని పడగొట్టిస్తామంటూ బెదిరించారని బీఆర్ఎస్ నేత రాజు ముదిరాజ్ ఆరోపించారు. వంద మంది గుండాలు వచ్చి బెదిరిస్తున్నారని, తనను చంపేస్తామంటూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని రాజు ఆరోపించారు.